జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దూకుడుగా పొలిటికల్ ఎటాక్ చేస్తున్నారు. ఆయన పాలనా తీరుపై.. కొద్ది రోజులుగా తీవ్రమైన విమర్శలు చేస్తున్న ఆయన తిరుపతిలో ఈ రోజు.. మరింత ఘాటుగా స్పందించారు. పరిపాలన చేత కాకపోతే.. దిగిపోయి.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డికి సూచించారు. రాయలసీమ పర్యటనలో భాగంగా తిరుపతిలో ఉన్న ఆయన.. ఉదయం రైతు బజార్‌ను సందర్శించారు. అక్కడ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఉల్లి కౌంటర్ ను పరిశీలించారు.
ఆధార్ కార్డ్ తీసుకు వస్తే… ఒక్క కేజీ ఉల్లిపాయలను రూ. పాతికకు ఇస్తున్నారు. ఆ ఒక్క కేజీ కోసం.. కనీసం రెండు కిలోమీటర్ల క్యూ… ఉండటంతో.. పవన్ కల్యాణ్ ఆశ్చర్యపోయారు. ఉల్లిపాయల కోసం.. లైన్లో నిలుచుకున్న వారితో పవన్ కల్యాణ్ మాట్లాడారు. వారంతా.. తమ బాధలను ఏకరవు పెట్టారు. తమ రోజువారీ జీవితంలో ఉల్లిపాయల కోసమే కష్టాలు కాదని.. కొత్త ప్రభుత్వం వచ్చాక.. తమకు వచ్చిన ఇబ్బందులన్నింటీనీ పవన్ కల్యాణ్‌కు జనం వివరించారు. ఉల్లి కోసం వచ్చిన వారే కాదు.. రైతు బజార్లో వ్యాపారం చేసుకునేవాళ్లు కూడా పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదులు చేశారు. సరఫరా లేకపోవడంతో.. తాము ఉపాధి కోల్పోతున్నామన్నారు.
వీరి బాధలు విన్న పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కూల్చివేతలపై దృష్టి పెట్టడం కన్నా… ప్రజల కష్టాలపై దృష్టి పెట్టి ఉండే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఒక్క చాన్స్ పేరుతో.. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిపై.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. ఇతర పార్టీలు భావిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కూడా అదే అంచనాలో ఉన్నట్లుగా.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న పవన్ డిమాండ్‌తోనే ఆ విషయం స్పష్టమవుతోందంటున్నారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానన్న జగన్ ఆ విషయంలో.. కాన్ఫిడెంట్‌గా ప్రజలకు మంచి చేశానని చెప్పలేకపోతున్నారు. ఆరు నెలల కాలంలో.. ప్రజలందరిపై ప్రభావం చూపే సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ పరిష్కారంలో మాత్రం… ప్రభుత్వ పరంగా.. పెద్ద కదలికలు కనిపించడం లేదు.