BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై పలు దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శాసనసభ స్పీకర్‌ను ఏకవచనంతో సంభోదించారంటూ మండిపడుతున్నాయి. ఉన్నత పదవిలో ఉన్న స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను ఏకవచనంతో సంబోధించిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలంటూ పలు దళిత సంఘ నాయకులు హైదరాబాద్‌లో ఆందోళనకు దిగారు. ట్యాంక్ బండ్ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ముందు కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నిక కావడాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని అల్ ఇండియా కాన్ఫడరేషన్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మహేశ్వర్ రాజు ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్పీకర్‌ను ప్రసాద్ కుమార్ అంటూ ఏకవచనంతో కేటీఆర్ సంభోదించడాన్ని ఆయన తప్పుబట్టారు. శాసనసభా నియమనిబంధనలకు విరుద్ధంగా మాట్లాడిన ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని కేటీఆర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని దళిత సంఘాలు కోరాయి.