ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్ నేతలను కలవనున్నారు. అనంతరం అధిష్ఠాన పెద్దలతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి రేవంత్ రెడ్డి ప్రధానిని కలవబోతున్నారు. మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీని రేవంత్ కలుస్తారని పార్టీ నేతలు వెల్లడించారు.
అనంతరం పార్టీ హైకమాండ్‌తో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, లోక్‌సభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇంకోవైపు ఆరు గ్యారెంటీల అమలు, అభయహస్తం మేనిఫెస్టో అమలు గురించి చర్చించనున్నట్లు సమాచారం. ఈ చర్చల అనంతరం రేవంత్ తిరిగి ఇవాళ రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. రేపు రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఉండటంతో ఇవాళ రాత్రే నగరానికి తిరుగు ప్రయాణం అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక శాసనసభ సమావేశాల్లో రేపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర సర్కార్ రంగం సిద్ధం చేసింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, తీసుకున్న రుణాలు, పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఇతర అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనున్నట్లు సమాచారం.