హైకోర్టు నూతన భవన సముదాయ శంకుస్థాపనకు ఏర్పాట్లుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే గురువారం హైదరాబాద్ ఎం సీఆర్హెచ్ఆర్డీలో సమావేశమయ్యారు. ప్రస్తుత హైకోర్టు భవనాలు శిథిలావస్థలో ఉన్న దృష్ట్యా రాజేంద్రనగర్లో ఇప్పటికే కేటాయించిన 100 ఎకరాల్లో నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రధాన న్యాయమూర్తి సీఎం దృష్టికి తెచ్చారు. జిల్లా కోర్టు భవనాల నిర్మాణానికి కూడా సహకరించాలన్నారు. స్పందించిన సీఎం భవన నిర్మాణానికి జనవరిలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో కార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, రిజిస్ట్రార్ జనరల్ తిరుమలాదేవి, న్యాయశాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు భారతీ హోళికెరి, అనుదీప్ తదితరులతో ముఖ్యమంత్రి ఈ విషయమై సమీక్షించారు. శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు.
ప్రస్తుత హైకోర్టు భవనం చారిత్రక కట్టడమైనందున, దాన్ని పునరుద్ధరించి పరిరక్షించాలని సూచించారు. నూతన భవన సముదాయంలోకి హైకోర్టు తరలింపు పూర్తయిన తర్వాత .. ప్రస్తుతం భవనాన్ని సిటీ కోర్టులు లేదా ఇతర కోర్టు కార్యకలాపాలకు వినియోగించాలని నిర్దేశించారు.