ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏం చేసినా సెన్సేషనే. ప్రపంచ దేశాల్లో మోదీకి చాలా క్రేజ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో మోదీ సూపర్ పాపులర్. ఆయన ప్రసంగాలు, ప్రెస్ మీట్లే కాదు ఈ మధ్య ఆయన ఏఐ సాంగ్స్ కూడా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ప్రధాని కూడా సోషల్ మీడియా మాధ్యమాలైన ట్విటర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలో మోదీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య మంగళవారం రోజున రెండు కోట్లు దాటింది.
ప్రపంచంలో మరే ఇతర నేతకూ ఇలాంటి ఘనత లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఈ ఛానల్‌ను మోదీ ప్రారంభించారు. ఇందులో మోదీ పోస్ట్ చేసిన వీడియోలకు వ్యూస్ 450 కోట్ల పైమాటే. ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్యలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో 64 లక్షల మంది వీక్షకులతో రెండో స్థానంలో ఉన్నారు. మోదీతో పోలిస్తే ఇది మూడోవంతు కంటే తక్కువే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పోస్ట్ చేసిన వీడియోలకు వ్యూస్ 22.4 కోట్లు వచ్చాయి. ఆ విషయంలో మోదీ తర్వాత స్థానం ఆయనదే. ప్రధాని మోదీతో ముడిపడిన యూట్యూబ్ ఛానల్- ‘యోగా విత్ మోదీ’కి 73,000 మంది, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఛానల్‌కు 35 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.