Political Updates: కాంగ్రెస్ 6 గ్యారంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు…!

Political Updates: Rs. 70 thousand crores annually for 6 guarantees of Congress...!
Political Updates: Rs. 70 thousand crores annually for 6 guarantees of Congress...!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓటర్ల మనసు గెలుచుకుంది. రాష్ట్ర ఓటర్లు ఆ పార్టీ హామీలను నమ్మి ఆ పార్టీని గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు కానున్న కొత్త సర్కార్ ఆరు గ్యారెంటీల అమలుపై ప్రధానంగా దృష్టి సారించనుంది. ఈ హామీల ముసాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేస్తారు. అనంతరం మంత్రివర్గం భేటీ అయి.. దానికి ఆమోదం తెలుపుతుంది.

ఈ హామీలకు సంబంధించి అర్హుల విధివిధానాలను ఖరారు చేసిన తర్వాత వీటికి ఎంత వ్యయమవుతుందన్న విషయంలో స్పష్టత రానుంది. గ్యారంటీలకు చట్టరూపం కల్పిస్తే వాటి అమలును ప్రశ్నించే హక్కు ప్రజలకు లభిస్తుంది. అయితే కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుకు ఏటా సుమారు రూ. 70 వేల కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా.

కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఏంటో మరోసారి చూద్దామా..?

1. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,500, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం. ఈ పథకానికి ఏటా సుమారు రూ.18 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా.
2. రైతు భరోసా కింద ఏటా రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు ఎకరాకు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరిపంటకు బోనస్‌గా క్వింటాలుకు రూ.500.
3. ఇల్లు లేని కుటుంబాలకు ‘ఇందిరమ్మ గృహ నిర్మాణం’ కింద ఇంటి స్థలం, రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయింపు.
4. ‘గృహజ్యోతి’లో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
5. యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటు
6. చేయూత కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, కల్లుగీత, బోదకాలు బాధితులు,హెచ్‌ఐవీ, డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి నెలవారీ పింఛను రూ.4 వేలు, పేదలకు రూ.10లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా.