జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. రాజౌరీ-థనామండీ-సురన్కోటె మార్గంలోని సావ్నీ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు తామే దాడి చేశామని ఉగ్రసంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రకటించింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుఫ్లియాజ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. గాలింపు కోసం జవాన్లను తరలిస్తున్న ఓ ట్రక్కు, జిప్సీ వాహనాలపై అకస్మాత్తుగా వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులకు భారత బలగాలు దీటుగా స్పందించాయి. కానీ దురదృష్టవశాత్తు పోరాడుతూనే ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు, ముష్కరులకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఘటనాస్థలికి అదనపు బలగాలను తరలిస్తున్నాం. రాష్ట్రీయ రైఫిల్స్-48 పరిధిలో ఈ ఆపరేషన్ జరుగుతోందని డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కర్నల్ సునీల్ బర్త్వాల్ వెల్లడించారు.