Political Updates: ఆ మూడింటిపై న్యాయవిచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

TG Politics: Revanth Reddy made key comments in the assembly..!
TG Politics: Revanth Reddy made key comments in the assembly..!

విద్యుత్‌ రంగ పరిస్థితిపై న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మూడు అంశాలపై న్యాయవిచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ వాడారని.. తాము వద్దని చెబుతున్నా సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ వాడారని విమర్శించారు. ప్రజల సెంటిమెంట్‌ను ఆధారంగా చేసుకుని ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తూ న్యాయవిచారణ చేయిస్తామని స్పష్టం చేశారు.

ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఒప్పందాలతో ఇండియా బుల్స్ కంపెనీకి లాభం చేకూర్చారని ఆరోపించారు. కాలం చెల్లిన టెక్నాలజీ వాడి రూ.10వేల కోట్లు వెచ్చించి రాష్ట్రాన్ని ముంచేశారని మండిపడ్డారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందన్న రేవంత్.. యాదాద్రి ప్రాజెక్టు 8 ఏళ్లయినా పూర్తి కాలేదని అన్నారు. ఛత్తీస్గఢ్ ఒప్పందం, యాదాద్రి ప్రాజెక్టు, భద్రాద్రి ప్రాజెక్టు.. ఈ మూడింటిపై న్యాయవిచారణకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.