మానవుడి ఆయుఃప్రమాణం తగ్గుతుంది

మానవుడి ఆయుఃప్రమాణం తగ్గుతుంది

వాయు కాలుష్యం కారణంగా మానవుడి ఆయుఃప్రమాణం తొమ్మిదేళ్లకు పైగా తగ్గుతోందని అమెరికా రీసెర్చ్‌ గ్రూప్‌ తన నివేదికలో తెలిపింది. భారత రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని తూర్పు, ఉత్తర, మధ్య రాష్ట్రాల్లో దాదాపు 480 మిలియన్లకు పైగా ప్రజలు వాయు కాలుష్యం బారిన పడుతున్నట్లు చికాగో యూనివర్సిటీలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ (ఈపిక్‌) బుధవారం వెల్లడించింది.ప్రపంచంలోనే అత్యధిక వాయుకాలుష్యం ఢిల్లీలోనే ఉందని, అక్కడ ప్రజలు ఎక్కువగా శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నివేదికలో పేర్కొంది.

అత్యధిక స్థాయిలో వాయు కాలుష్యం భౌగోళికంగా విస్తరిస్తోందంటూ ఈపిక్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, వాయు కాలుష్యాన్ని నియంత్రించటం కోసం భారత్‌ 2019లో నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం ఏర్పాటు చేసి.. ప్రజల ఆయుః ప్రమాణం పెంచేలా తగు చర్యలు తీసుకుందంటూ ప్రశంసలు కురిపించింది. అదే విధంగా వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచనల మేరకు పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ సైతం వాయు కాలుష్య నియంత్రణకు తగు చర్యలు తీసుకుందని ఈపిక్‌ నివేదికలో ప్రశంసించింది.