పంజ్‌షీర్‌ ప్రాంతంపై తాలిబన్ల దాడి

పంజ్‌షీర్‌ ప్రాంతంపై తాలిబన్ల దాడి

తమకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్‌ ప్రాంతంపై పట్టుకోసం తాలిబన్లు ప్రయత్నాలు ఆరంభించారు. ఇందులో భాగంగా పంజ్‌షీర్‌ ప్రాంతంపై తాలిబన్లు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 8 తాలిబన్లు మరణించారని పంజ్‌షీర్‌ వర్గాలు తెలిపాయి. పంజ్‌షీర్‌లో తాలిబన్‌ వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న అహ్మద్‌ మసూద్‌ ప్రతినిధి ఫహీమ్‌ దాస్తీ ఈ విషయాన్ని వెల్లడించారు.

సోమవారం రాత్రి తాలిబన్లు తమ లోయపై దాడికి వచ్చారని, అయితే తమ బలగాలు దాడిని తిప్పికొట్టాయని చెప్పారు. ఇరువైపులా పలువురికి గాయాలయ్యాయని, కానీ తాలిబన్ల వైపు ప్రాణనష్టం కూడా జరిగిందని చెప్పారు. ఓవైపు 20 ఏళ్ల యుద్దానికి ముగింపు పలుకుతూ అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తవుతుండగా.. మరోవైపు తాలిబన్లు ఈ దాడికి దిగడం గమనార్హం.