Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ ప్రారంభం అయిన కొత్తలో తొలి తరం యాంకర్‌గా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్ మల్లిక. బుల్లి తెర అప్పుడప్పుడే పరిచయం అవుతున్న సమయంలో యాంకర్‌గా మల్లిక చేసిన సందడి అంతా ఇంతా కాదు. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికి కూడా మల్లిక యాంకర్‌గా సుపరిచితురాలు. ప్రస్తుతం యాంకరింగ్‌లో ఉన్నా, యాంకరింగ్ చేసి తప్పుకున్న వారందరికి కూడా మల్లిక ఇన్సిపిరేషన్ మరియు ఆప్తురాలిగా చెప్పుకోవచ్చు. 1997 నుండి 2004 వరకు యాంకర్‌గా ఎన్నో షోలు చేయడంతో పాటు పలు సీరియల్స్ మరియు సినిమాల్లో మల్లిక నటించారు.
యాంకర్‌గా ఎంతో మంచి పేరు సంపాదించిన మల్లిక కేవలం 39 ఏళ్ల వయస్సులోనే అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. గత కొన్నాళ్లుగా కోమాలో ఉన్న మల్లిక నేడు ఉదయం 10.30 నిమిషాలకు మృతి చెందారు. మల్లిక మృతి పట్ల సినీ మరియు బుల్లి తెర ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాజీవ్ కనకాల మరియు సుమలు మల్లికతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని కంటతడి పెట్టారు. మహేష్‌బాబు ‘రాజకుమారుడు’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో మల్లిక నటించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మళ్లీక ఇటీవలే ఒకటి రెండు సినిమాల్లో నటించారు. కాని అవి ఇంకా విడుదల కాలేదు. కొన్ని బుల్లి తెర షోలకు కూడా ఆమె వ్యాఖ్యతగా వ్యవహరించేందుకు కమిట్ అయ్యారు. ఈలోపు ఆమె అనారోగ్యం పాలవ్వడంతో పాటు, చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మల్లిక ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.