Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినీ రంగంలో పోసాని కోపం గురించి తెలియని వాళ్లుండరు. అయితే ప్రజారాజ్యం అనుభవం తర్వాత పోసానిలో కూడా కాస్త లౌక్యం కనిపిస్తోంది. అనవసర వివాదాలు వద్దనుకునే ధోరణి కనిపించింది. అయితే అంతలోనే ఆయన నిర్ణయంలో మార్పు కూడా వచ్చింది. వైసీపీ అనుకూల ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. సరే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు లోకేష్ మీద బుద్ధి ఉందా ? చదువుకున్నావా ? అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం చూస్తుంటే మాత్రం పాత పోసాని మళ్ళీ బయటకు వచ్చాడు అనిపించింది. నిజానికి అవార్డుల విషయంలో పోసానికి అన్యాయం జరగలేదు. అంతా అనుకున్నట్టే టెంపర్ సినిమాకు ఆయన ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చింది. కానీ పోసానికి ఆ అవార్డు తిరిగి ఇచ్చేంత కోపం రావడానికి కేవలం లోకేష్ కామెంట్స్ కారణం అనుకోడానికి వీల్లేదు.
దర్శకుడు బోయపాటి శ్రీను ను టీడీపీ సర్కార్, చంద్రబాబు, బాలకృష్ణ దగ్గరకు తీస్తున్న తీరు నచ్చక పోసాని ఆ కోపాన్ని ఈ విధంగా బయటపెట్టారని ఫిలిం నగర్ టాక్. బోయపాటి వ్యవహారశైలి మీద గతంలో పోసాని ఏ స్థాయిలో వ్యాఖ్యలు చేశారో అందరూ చూసారు. ఆ కోపం ఇంకా చల్లారకపోవడం వల్లే పోసాని అదను చూసుకుని లోకేష్ మీద విమర్శలు చేసి ఉంటారని కొందరి వాదన. ఈ వాదనలో నిజం ఎంతో పోసాని మాత్రమే చెప్పగలరు. ఏదేమైనా పోసాని ప్రెస్ మీట్ తో నంది వివాదం ఇంకో సారి భగ్గుమంది.