కొద్దిరోజులుగా జనసేనాని వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారట. అందుకే పార్టీ కార్యక్రమాల్లో కాస్త వేగం తగ్గించినట్లు పరోక్షంగా చెబుతున్నారు. వెన్నెముక నొప్పికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు పవన్ పార్టీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.
పవన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. ‘మీడియా మిత్రులకు నమస్కారం.. విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మీడియా స్వేచ్చ కోసం మీరు చేస్తున్న పోరాటానికి జనసేన తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున సంపూర్ణ మద్దతును తెలియచేస్తున్నాను. అయితే ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నాను’అన్నారు.
‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో వెన్ను పూసలకు తీవ్ర గాయాలు కావడంతో తరచూ నన్ను వెన్ను నొప్పి బాధిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచార సమయంలో అశ్రద్ధ చేయడంవల్ల గాయాల నొప్పి తీవ్రత పెరిగింది. డాక్టర్లు సర్జరీకి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ సంప్రదాయ వైద్యం పై నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళుతున్నాను. గత కొన్ని రోజులుగా మళ్ళీ బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను’అంటూ ప్రకటనలో తెలిపారు.ఈ కారణంగానే గత మూడు రోజులుగా ఎటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం లేదు.