యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ పేరు వింటే చాలు అభిమానులు ‘అన్నయ్య’, ‘డార్లింగ్’ అంటూ గుండెల్లో గుడి కట్టుకుంటారు. తన యాక్టింగ్ స్టైల్, మంచి మనసుతో ఎందరో అభిమానులు సంపాదించుకున్నాడు ఈ డార్లింగ్. రాజమౌళి తీసిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. తర్వాత వచ్చిన ‘సాహో’తో మరింత పాపులర్ అయ్యాడీ మిస్టర్ ఫర్‌ఫెక్ట్. ఫైటింగ్‌లు, రొమాన్స్‌లు కాకుండా ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడంలోనూ ప్రభాస్ బాహుబలినే.ఇందుకు తాజా నిదర్శనం ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను తన మంచి మనసుతో ఆదుకోవడం.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. అందులో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. కోటి విరాళంగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన చెక్కును త్వరలో సీఎం కార్యాలయానికి పంపనున్నాడు. గతంలో కరోనా సమయంలోనూ ఈ పాన్ ఇండియా స్టార్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున విరాళం అందించాడు. ప్రధానమంత్రి సహాయనిధికి మరో రూ. 3 కోట్లు ఇచ్చాడు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీతో అభిమానులు, ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు డార్లింగ్ ప్రభాస్.