హైదరాబాద్‌లో కన్నా ముంబైలోనే ఎక్కువ

హైదరాబాద్‌లో కన్నా ముంబైలోనే ఎక్కువ

బాహుబలి తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా పాన్‌ ఇండియా చిత్రాల వెంటపడ్డాడీ హీరో. ప్రస్తుతం నాలుగు పాన్‌ ఇండియా సినిమాలు ఆయన చేతులో ఉన్నాయి. ఈ సినిమా షెడ్యూల్స్‌ వల్ల హైదరాబాద్‌లో కన్నా ఎక్కువగా ముంబైలోనే గడపాల్సి వస్తోంది. ఈ క్రమంలో హోటళ్లు, అద్దె గదులు అంటూ ఎక్కడెక్కడో విడిది చేసే బదులు ఏకంగా ముంబైలో సొంతంగా ఓ ఫ్లాట్‌ కొనాలని చూస్తున్నాడట డార్లింగ్‌ హీరో.

ముఖ్యంగా ‘ఆదిపురుష్’‌ సినిమా ఎక్కువ భాగం ముంబైలో చిత్రీకరణ జరుపుకోనున్న నేపథ్యంలో అక్కడ తనకంటూ ఓ ఇల్లుంటే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడట. దీంతో ప్రభాస్‌ టేస్ట్‌కు తగ్గ ఇల్లు చూసి పెట్టేందుకు టీ సిరీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భూషణ్‌ కుమార్‌ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అంటే త్వరలోనే ప్రభాస్‌ ముంబైలో ఓ విలాసవంతమైన ఇల్లును సొంతం చేసుకోనున్నాడన్నమాట. ఇక ఈ మధ్యే హీరోయిన్‌ రష్మిక మందన్నా సైతం ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే

ఇదిలా వుంటే ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్‌ జూలై 30న, ఆదిపురుష్‌ వచ్చే ఏడాది ఆగస్టు 11న రిలీజ్‌ అవుతుండగా, సలార్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న థియేటర్లలో అడుగు పెట్టనుంది. వీటితోపాటు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మరో పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇందులో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపిక పదుకొణె ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.