షూటింగ్ కోసం గోదావరిఖని వచ్చిన ప్రభాస్

షూటింగ్ కోసం గోదావరిఖని వచ్చిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలో సందడి చేశారు. ప్రస్తుతం ఆయన కన్నడ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఫస్ట్‌లుక్ కూడా సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు తాజాగా యూనిట్ ప్రకటించింది. అభిమానులు ఆ సందడిలో ఉండగానే శుక్రవారం ప్రభాస్ గోదావరి ఖనిలో వాలిపోయాడు.

గోదావరి ఖని పరిధి రామగిరి మండలంలోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్ ప్రాంతంలో ‘సలార్’ మొదటి షెడ్యూల్ షూటింగ్‌ జరుపుకుంటోంది. ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు దగ్గర వేసిన భారీ సెట్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ చిత్రీకరించనున్నారు. సుమారు 10 రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం .ఈ క్రమంలోనే శుక్రవారం రామగుండం కమిషనరేట్‌కు వచ్చిన ప్రభాస్ రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీ సత్యనారాయణ ప్రభాస్‌కు తన సిబ్బందిని పరిచయం చేశారు. పలువురు పోలీసు సిబ్బంది ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.