Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనుష్కతో డిసెంబరులో ఎంగేజ్ మెంట్ అంటూ వస్తున్న వార్తలను హీరో ప్రభాస్ ప్రతినిధులు ఖండించారు. ఇది తప్పుడు ప్రచారమని వారు తెలిపారు. నిజంగానే ప్రభాస్, అనుష్క మధ్య సంబంధం ఉంటే. దాన్ని వారే స్వయంగా ప్రకటిస్తారని, వారికి సంబంధం లేనివారు చేసే ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ప్రముఖ సినీ సమీక్షకుడు ఉమైర్ సంధు ప్రభాస్, అనుష్క ఎంగేజ్ మెంట్ గురించి ట్విట్టర్ లో ప్రకటనచేశాడు. వారిద్దరూ కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లిచేసుకుంటారని ఆయన ట్వీట్ చేశాడు. వారి ఆప్తమిత్రుల నుంచి తనకీ సమాచారం అందిందని కూడా ఉమైర్ సంధు తెలిపాడు. ఆయన ట్వీట్లు కలకలం రేపాయి. ఉమైర్ సంధు చెప్పింది నిజమని అంతా భావించారు.
బిల్లా, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల్లో కలిసి నటించిన ప్రభాస్, అనుష్క అనుబంధంపై చాలా ఏళ్ల నుంచి తెలుగు ఇండస్ట్రీలో పుకార్లు వినిపిస్తున్నాయి. తొలి సినిమా బిల్లా సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారని. అప్పటినుంచి వారి బంధం కొనసాగుతోందని చెప్పుకున్నారు. ఈ విషయంపై మీడియా అనేకమార్లు ప్రశ్నించినా. వారిద్దరూ ఎప్పుడూ పెదవి విప్పలేదు. ఆ పుకార్లలో నిజం లేదని మాత్రమే చెబుతూ వచ్చారు. కానీ ఉమైర్ సంధు ట్వీట్ తర్వాత అందరూ ఊహించిందే నిజమైందని భావించారు. కానీ ప్రభాస్ ప్రతినిధుల తాజా వ్యాఖ్యలతో అయోమయం నెలకొంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సాహో సినిమాలో నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదట అనుష్కనే హీరోయిన్ అని వార్తలు వినిపించాయి. కానీ చివరకు శ్రద్ధాకపూర్ ను ఎంపికచేసుకున్నారు. అటు అనుష్క భాగమతి అనే సినిమాలో నటిస్తోంది. సాహో, భాగమతి రెండు చిత్రాలు ఒకే బ్యానర్ పై నిర్మితమవుతుండడం విశేషం.