రాహుల్ కోసం ముహూర్తం ఫైనల్.

Rahul Gandhi takes oath as president of Congress on october 25

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్ని వైఫల్యాలు వెంట వున్నా కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని కొడుకు రాహుల్ గాంధీకి అప్పగించడానికి సోనియా గాంధీ డిసైడ్ అయిపోయారు. అందుకోసం ముహూర్తం కూడా నిర్ణయించారు. ఈ నెల 25 న రాహుల్ పట్టాభిషేకానికి పండితులు ముహూర్తం పెట్టారు. అనారోగ్యం, వయసు రీత్యా కాంగ్రెస్ బాధ్యతలు నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సోనియా స్వయంగా ఆ రోజు కొడుకు మీద పార్టీ బాధ్యతలు అధికారికంగా పెట్టబోతున్నారు .

2014 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వైఫల్యంతో రాహుల్ పని తీరు మీద కాంగ్రెస్ శ్రేణుల్లోనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. కేరళ లాంటి కొన్ని రాష్ట్రాల నేతలు కొందరు రాహుల్ కి వ్యతిరేకంగా గళమెత్తారు. ఇక రాహుల్ కి అనుక్షణం వెన్నంటి వుండే దిగ్విజయ్ లాంటి నేతలు కూడా ఆయన వ్యవహారశైలి మారాలని అభిప్రాయపడ్డారు. దీంతో రాహుల్ కి కాకుండా ప్రియాంక ని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయొచ్చన్న అభిప్రాయాలు కూడా కొన్ని సందర్భాల్లో వ్యక్తం అయ్యాయి. అయితే ఆమె రాజకీయాల్లో పాక్షికంగానే పాల్గొనే ఆలోచన చేశారు. సోదరుడు రాహుల్ కి అండగా వుండాలని భావించారు. ఇక కాంగ్రెస్ కూడా అధ్యక్ష హోదాలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలితే రాహుల్ రాటుదేలుతారని అనుకుంటోంది. అదే నమ్మకంతో ఇప్పుడు రాహుల్ కి కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు అప్పగించబోతోంది.