Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమ్న హత్యకేసు అనుమానితుడిగా భావిస్తున్న 11వ తరగతి విద్యార్థి గురించి రోజుకో ఆశ్చర్యకరమైన విషయం వెలుగుచూస్తోంది. పరీక్ష వాయిదా పడేలా చేసేందుకే సీనియర్ విద్యార్థి ప్రద్యుమ్నను హత్యచేశాడన్న విషయం తెలియడంతో దేశంమొత్తం ఒక్కసారిగా షాక్ తింది. చిన్నారుల్లో పెరుగుతున్న నేరప్రవృత్తిపై సర్వత్రా భయాందోళనలు సైతం వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆ విద్యార్థి గురించి సీబీఐ అధికారుల విచారణలో వెల్లడవుతున్న మరిన్ని నిజాలు తీవ్ర విభ్రాంతికి గురిచేస్తున్నాయి. 16 ఏళ్ల ఆ విద్యార్థి .ఏదో క్షణికావేశంలో కాకుండా పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ హత్య చేయడం..అలాగే పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకోవడం సిబీఐ అధికారులకు కూడా విస్మయం కలిగిస్తోంది.
హత్యకు ముందురోజుల్లో ఆ విద్యార్థి రకరకాల విషపదార్థాల గురించి నెట్ లో వెతికాడని, అలాగే విషపదార్థాలను ఎలా ఉపయోగించాలి, హత్య చేసిన తరువాత కత్తిమీద వేలిముద్రలు ఎలా తీసేయాలనే దాని గురించి పరిశోధించాడని విచారణలో తేలింది. విద్యార్థి మొబైల్ ఫోన్, ల్యాప్ ట్యాప్ ను పరిశీలించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రద్యుమ్నను హత్యచేయడానికి ఉపయోగించిన కత్తిని ఆ విద్యార్థి ఒక రోజు ముందు కొనుగోలుచేశాడని సీబీఐ అధికారులు తెలిపారు. విచారణ చాలా సున్నితమైన దశలో ఉందని, ఇప్పడే ఈ కేసుపై ఎలాంటి వ్యాఖ్యా చేయలేమని వారు చెప్పారు. ప్రస్తుతం ఆ విద్యార్థి జువైనల్ హోం లో ఉన్నాడు. సాంకేతిక పరిజ్ఞానం చిన్నారులపై ఎలాంటి దుష్రభావం చూపిస్తుందో ప్రద్యుమ్న కేసు చూస్తే అర్ధమవుతుంది. సీనియర్ విద్యార్థి ఓ సంచలనం కోసమే ప్రద్యుమ్నను చంపివేసినట్టు అర్ధమవుతోంది. హత్యచేయడం, తప్పించుకోవడాన్ని హీరోయిజంగా చూపించే వీడియోగేమ్స్ ప్రభావం ఆ విద్యార్థి పై తీవ్ర ప్రభావం చూపాయని, తాను కూడా అలా ఓ హత్య చేసి హీరో అనిపించుకోవాలని భావించాడని సైకాలజిస్టులు విశ్లేషిస్తున్నారు.