Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వెండితెర మీద హీరోలుగా వెలిగిపోయే వాళ్లకి విలువ ఎక్కువ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకి విలువ తక్కువ అని ఎవరైనా భావిస్తే అంతకన్నా శుద్ధతప్పు ఇంకోటి ఉండదని చెప్పే బెస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు నడుస్తోంది. కమల్ ఒక్క తమిళనాడులోనే కాదు యావద్ భారతంలో ఎంత పెద్ద నటుడో వేరే చెప్పక్కర్లేదు. అయితే ఆయనకి దక్కిన, దక్కుతున్న గౌరవం ఓ నటుడిగా మాత్రమే అని అర్ధమయ్యే రోజు వచ్చింది.
జయ మరణం తరువాత ఆయన తమిళ రాజకీయాల మీద గళమెత్తడం ఎక్కువ చేశారు. వెండితెర ఫ్రెండ్ కం ప్రత్యర్థి రజని పార్టీ పెట్టబోతున్నాడు అన్న దగ్గర నుంచి కమల్ దూకుడు ఇంకాస్త పెరిగింది. అన్నిటిలో విశాలభావాలు, ప్రపంచ పౌరుడి స్థాయిలో మాట్లాడే కమల్ బయటికి చెప్పినా చెప్పకపోయినా తమిళేతరుడు అయిన రజని ఆ రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అందుకే తాను స్పీడ్ అయ్యారు. పార్టీ పెడుతున్నట్టు అనౌన్స్ చేశారు. తమిళనాట అధికారంలో వున్న అన్నాడీఎంకే తో పాటు ప్రధాని మోడీ, బీజేపీ కి వ్యతిరేకంగా దాడి పెంచారు. మోడీని వ్యతిరేకించే కేజ్రీవాల్, వామపక్ష నేతలతో భేటీలు జరిపారు. అయినా కమల్ వాయిస్ కి అనుకున్నంత బజ్ రాలేదు. బీజేపీ అయితే ఆయన్ని అసలు పట్టించుకోనే లేదు. కమల్ మాటల్ని ఓ కొద్ది స్థాయి రాజకీయ నేత మాటలుగానే చూసింది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ విషయానికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. జస్ట్ అస్కింగ్ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా వేస్తున్న ప్రశ్నలకి మాత్రం బీజేపీ హడలెత్తిపోతోంది. జర్నలిస్ట్ గౌరీష్ హత్య మొదలుకుని తాజ్ మహల్ దాకా ఆయన సంధిస్తున్న అతి సామాన్యమైన ప్రశ్నలు బీజేపీ ని కకావికలం చేస్తున్నాయి. ఆ పార్టీ అభిమానులు ప్రకాష్ రాజ్ మీద విరుచుకుపడే కొద్ది ఆయన స్వరం ఇంకా పెరుగుతోంది. ఆయన రెచ్చిపోతున్న కొద్ది జనంలో స్పందన పెరుగుతోంది. జరుగుతున్న డామేజ్ చూసి ఆయన్ని సైలెంట్ చేసే మార్గాల కోసం బీజేపీ అన్వేషిస్తోంది. ఈ రెండు విషయాలు గమనించినప్పుడు కమల్ కన్నా ప్రకాష్ రాజ్ అంత గొప్పవాడా అనిపించకమానదు.
కాస్త లోతుగా పరిశీలిస్తే కమల్, ప్రకాష్ రాజ్ ల మధ్య తేడా ఏమిటో తెలిసిపోతుంది. ఇద్దరూ తమ రంగంలో దిగ్గజాలే. తమ జీవితాన్ని సమాజపు పోకడలకు తలొగ్గి కాకుండా అనుకున్నట్టు గాఢంగా బతకగలిగిన వాళ్ళే. సామాజిక కట్టుబాట్లని ధిక్కరించే వీళ్ళు సామాజిక బాధ్యత విషయంలో మాత్రం భిన్నమే. కమల్ గొంతుక ఇప్పుడు సొంత రాజకీయాల కోసం, అంతక ముందు విశ్వరూపం సినిమా విడుదలకి ఇబ్బందులు ఎదురు అయినప్పుడు మాత్రమే గట్టిగా వినిపించింది. అప్పుడప్పుడు సామాజిక లోటుపాట్లని ఆయన ఎత్తిచూపిన తీరు కమల్ ని ఓ మేధావిగా ప్రపంచానికి చూపిందేమో గానీ అంతకు మించి ఒరిగింది లేదు.
కానీ ప్రకాష్ అక్కడే తనకంటూ ఓ ప్రత్యేకత చూపించాడు. తన అవసరానికి కాకుండా సామాజిక స్థైర్యం కోసం గొంతెత్తాడు. భయపెట్టే కొద్ది ధైర్యం చూపించాడు. తనకి ఏ మాత్రం అవసరం లేకపోయినా ఓ సంఘ జీవిగా తానేమి చేయాలో అదే చేస్తున్నాడు. ఈ క్రమంలో తన రక్షణ ఛత్రాన్ని వదిలి మరీ ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా గొంతు ఎత్తడం మనకు కనిపించింది. కానీ తమిళ రైతులతో పాటు ఢిల్లీ వీధుల్లో దీక్షకి కూర్చున్న విషయం ఇంతగా గుర్తు ఉండకపోవచ్చు. ఇక తనకు ఓ మనిషిగా తప్ప ఏ సంబంధం లేని తెలంగాణ పల్లెని దత్తత తీసుకోవడమే కాదు అక్కడి మనుషుల్లో ఒకడిగా కలిసిపోయిన ప్రకాష్ ఆ విషయాన్ని పెద్దగా ప్రచారం చేసుకోడు. అయినా లోకం ఆయన్ని గమనిస్తూనే వుంది. అందుకే స్వార్ధం లేకుండా ముందుకు వచ్చిన ప్రకాష్ రాజ్ ని గౌరవిస్తోంది. ఆయన మాటకి బీజేపీ భయపడుతోంది. కమల్ ని లైట్ తీసుకుంటూ ప్రకాష్ మాటకి హెవీ వెయిట్ ఇస్తోంది.
రాజకీయాల్లో కూడా ఏ త్యాగం లేకుండా ఇలాగే వెలిగిపోదాం అనుకునే వెండితెర మీద హీరోలకి ప్రకాష్, కమల్ ఎపిసోడ్ ఓ పెద్ద పాఠం. జనం వెండితెర మీద హీరోల్ని నిజ జీవితపు జీరోల్ని గుర్తిస్తారు. అందుకే నటనలో కమల్ దరిదాపులకు కూడా రాని రజని ని అక్కడెక్కడో కూర్చోబెట్టారు. ఈ చిన్న విషయాన్ని గమనిస్తే ఎక్కడ నటించాలో, ఎలా జీవించాలో హీరోలకి బాగా అర్ధం అవుతుంది.