నటుడిగా ఉన్నపుడే కాదు.. రాజకీయాల్లో అడుగు పెట్టాక కూడా ప్రకాష్ రాజ్ తరచుగా వివాదాల్లో నిలుస్తున్నారు. నరేంద్ర మోడీ సర్కారును వ్యతిరేకిస్తూ లౌకిక వాదం వినిపించే క్రమంలో ఆయన కొన్నిసార్లు అదుపు తప్పి మాట్లాడుతుండటం, లాజిక్ లేని పాయింట్లు తీస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది.
హిందుత్వ సిద్ధాంతాలు, హిందూ సంస్కృతీ సంప్రదాయాల గురించి తరచుగా ఏదో ఒక అభ్యంతరం లేవనెత్తే ప్రకాష్ రాజ్.. తాజాగా దసరా పండుగ సమయంలో ప్రదర్శించే రామ్ లీలా నాటకం మీద పడ్డారు. ఈ నాటకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ‘రామ్ లీలా’ వేడుకకు అనుమతి ఇవ్వడం అంటే.. చిన్న పిల్లాడికి పోర్న్ చూపించడంతో సమానం అని ప్రకాష్ రాజ్ ఒక విచిత్రమైన లాజిక్ తీశారు. దానికి దీనికి ఎలా పోలిక సరిపడుతుందో ప్రకాష్ రాజ్‌కే తెలియాలి.
రామ్ లీలా లాంటి వేడుకలు మైనారిటీల్లో భయం కలిగిస్తాయని ప్రకాష్ రాజ్ పేర్కొనడం గమనార్హం. హిందువులు గుళ్లకు వెళ్లి దేవుడిని ఆరాధించడం పట్ల తనకెలాంటి అభ్యంతరాలు లేవని.. కానీ పబ్లిక్‌లో రామ్ లీలా లాంటి నాటకాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఓ టీవీ చర్చలో భాగంగా ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాముడు, సీత, లక్ష్మణుడు వేషాల్లో ఉన్న వాళ్లు హెలికాఫ్టర్లో రావడమేంటి.. ఇది మన సంస్కృతి కాదు అంటూ ఇంకో చిత్రమైన ప్రశ్న లేవనెత్తాడు ప్రకాష్ రాజ్. ఐతే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో హిందు మద్దతుదారులు తీవ్రంగా మండి పడుతున్నారు. సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన విషయాల్లో ఈ జోక్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాది వాళ్లయితే ఆయన తీరును తీవ్రంగా దుయ్యబడుతున్నారు. లౌకిక వాదం పేరుతో హిందువులు చేసే ప్రతి పనినీ విమర్శించడం ప్రకాష్ రాజ్ లాంటి సూడో సెక్యూలరిస్టులకు ఫ్యాషన్ అయిపోయిందంటూ వాళ్లు తిట్టి పోస్తున్నారు.