Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జస్ట్ అస్కింగ్ అంటూ కొన్నాళ్లుగా ప్రధాని మోడీని చాలా విషయాల మీద ప్రశ్నిస్తూ వచ్చిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ తాను హిందువులకు వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. ఓ మతాన్ని ఈ ప్రపంచంలో లేకుండా చేయాలని పిలుపు ఇచ్చిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మీద ప్రకాష్ రాజ్ విరుచుకుపడ్డారు. ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళు హిందువులే కాదని ప్రకాష్ రాజ్ చెప్పారు. హింస, హత్యల్ని నమ్మేవాళ్ళు ఎన్నటికీ హిందువులు కాలేరని ప్రకాష్ రాజ్ వివరించారు. ఇలా మాట్లాడుతున్న అనంత్ కుమార్ హెగ్డే ని నిలవరించరా అని ప్రధాని మోడీని ప్రశ్నిస్తున్నారు ప్రకాష్ రాజ్. తన క్యాబినెట్ లో వుంటూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా మాట్లాడుతున్న వారిని ఆపకపోతే మోడీని కూడా హిందువు కాదు అనుకోవాల్సి వస్తుందని ప్రకాష్ రాజ్ అంటున్నారు.
భావ వ్యక్తీకరణకు అడ్డుకట్ట వేయడం తగదని చెబుతున్న తనను యాంటీ హిందూ అని ప్రచారం చేయడాన్ని ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. తాను హిందువులకి వ్యతిరేకం కాదని, మోడీ , అమిత్ షా , అనంత్ కుమార్ హెగ్డే కి మాత్రమే వ్యతిరేకం అని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. పరిపాలన చేసే స్థాయిలో వున్నవారికి ద్వేష భావనలు ఉండడం తగదని ఆయన హితవు పలికారు. భయాన్ని, విద్వేష భావాల్ని వ్యాప్తం చేసేవాళ్ళకి పాలకులు అడ్డుకట్ట వేయాల్సిన అవసరాన్ని గుర్తించేదాకా తన పోరాటం ఆగబోదని ప్రకాష్ రాజ్ తేల్చి చెప్పారు