మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పర్వం ముగిసినప్పటికీ ఎన్నికల రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలింగ్ జరిగిన తీరుపై అనుమానం వ్యక్తం చేశారు ప్రకాశ్‌రాజ్. పోలింగ్ జరిగిన రోజు సీసీటీవీ దృశ్యాలు ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. పోలింగ్‌రోజు కొంతమంది వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, మోహన్‌బాబు, నరేశ్ మా సభ్యులను బెదిరించడమే కాకుండా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.
మీరే వారిని, వారి అనుచరులను పోలింగ్ ప్రదేశాల్లోకి అనుమతించారని భావిస్తున్నామన్నారు. మా ఎన్నికలు జరిగిన తీరు జనంలో మనల్ని చులకన చేసిందన్నారు. అసలేం జరిగిందన్నది మా సభ్యులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారని పేర్కొన్నారు. పోలింగ్ సమయంలో సీసీ కెమెరాలు వాడిన సీసీ టీవీ దృశ్యాలు తమకు ఇవ్వాల్సిందిగా కోరారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 3నెలల వరకు దృశ్యాలు భద్రపరచడం మీ బాధ్యత అంటూనే వాటిని కోరే హక్కు తమకు ఉందని నొక్కి చెప్పారు. ప్రకాశ్‌రాజ్ లేఖపై మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజ్ మా ఆఫీసులో భద్రంగానే ఉందని, నిబంధనల ప్రకారం ఎవరడిగినా ఇవ్వడానికి రెడీ అని తెలిపారు.