మోడీని పొగిడిన ప్ర‌ణ‌బ్…

pranab mukherjee praises modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌ధానమంత్రి మోడీపై కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నుంచి గల్లీ స్థాయి నేత‌వ‌ర‌కు అంద‌రూ వ‌రుస‌పెట్టి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప‌రిపాల‌న‌, విదేశీ వ్య‌వ‌హారాలు, పార్టీ… ఇలా ఏదో ఒక అంశాన్ని లేవ‌నెత్తి… కాంగ్రెస్ నేత‌లంతా మోడీ వైఖ‌రిని అనేక విధాలుగా ఎండ‌గ‌డుతున్నారు. అయితే ఇందులో అస‌హ‌జ‌మేమీ లేదు. అధికార‌ప‌క్షాన్ని, ప్ర‌తిప‌క్షం విమ‌ర్శించ‌డం ప్ర‌జాస్వామ్యంలో అత్యంత స‌హ‌జ‌మైన విష‌యం. అందుకే కాంగ్రెస్ నేత‌లు మోడీ ప్ర‌తిచ‌ర్య‌ను విమ‌ర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే కాంగ్రెస్ ఉద్ధండ నేత, కాక‌లు తీరిన ఓ రాజ‌కీయ‌వేత్త మాత్రం మోడీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. కాంగ్రెస్ పంథాకు భిన్నంగా మోడీని గొప్ప‌వాడ‌ని కీర్తించారు. అంతేకాదు… మోడీని నిబ‌ద్ధ‌త ఉన్న నేత‌గా కూడా ఆ కాంగ్రెస్ సీనియ‌ర్ కొనియాడారు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే… మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ.

త‌న ఆటో బ‌యోగ్ర‌ఫీ లో కాంగ్రెస్ అంత‌ర్గ‌త విష‌యాలు, ప‌దేళ్ల యూపీఏ పాల‌న‌లో చోటుచేసుకున్న అనేక ప‌రిణామాల‌ను ప్ర‌స్తావిస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్న ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ తాజాగా ప్ర‌ధానిపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. మోడీ త‌నదైన రీతిలో క‌ష్టించి ప‌నిచేస్తార‌ని, త‌న ల‌క్ష్యాల‌ను సాధించ‌డంలో ఆయ‌న‌కు చాలా నిబద్ధ‌త ఉంద‌ని ప్ర‌ణ‌బ్ విశ్లేషించారు. శ్ర‌మించే త‌త్త్వం, ధృఢ‌నిశ్చ‌యం ఆయ‌న‌లో ఉన్నాయ‌ని, త‌న విజ‌న్ ను సాధించ‌డంలో పూర్తి స్ప‌ష్ట‌త‌తో ఉన్నార‌ని ఆయ‌న కొనియాడారు. పార్లమెంటులో అంత‌కుముందు ఎలాంటి అనుభ‌వం లేక‌పోయిన‌ప్ప‌టికీ… మోడీ రాణిస్తున్నార‌ని ప్ర‌ణ‌బ్ ప్ర‌శంసించారు.

ప‌రిపాల‌న‌, రాజ‌కీయ, విదేశాంగ విధానాల్లోని చిక్కుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు. 2014లో ప్ర‌ధానిగా త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి సార్క్ దేశాల అధినేత‌ల‌ను మోడీ ఆహ్వానించ‌డాన్ని ప్ర‌ణ‌బ్ గుర్తుచేశారు. పొరుగు దేశాలతో స‌త్సంబంధాలు నెల‌కొల్పుకోడానికి ఈ ప‌రిణామం ఎంత‌గానో దోహ‌దం చేసుంద‌ని మాజీ రాష్ట్ర‌ప‌తి విశ్లేషించారు. మ‌రి ప్ర‌ణ‌బ్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ ఎలా స్వీక‌రిస్తుందో చూడాలి. బీజేపీకి మాత్రం కాంగ్రెస్ పై ఎదురుదాడి చేయ‌డానికి ప్ర‌ణ‌బ్ మాటలు ఉప‌క‌రిస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.