ఆ క‌ళ్లే అన్నీ చెబుతాయి…

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Keerthy suresh first look in Mahanati movie

అందం, అభిన‌యం మ‌హాన‌టి సావిత్రి సొంతం. హీరోయిన్ గా రెండు ద‌శాబ్దాల పాటు తెలుగు, తమిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను ఏలిన సావిత్రి… ముఖంలో అన్నిర‌కాల హావభావాలు ప‌లికించ‌డంలో దిట్ట‌. ముఖ్యంగా క‌ళ్ల‌తోనే అభిన‌యించ‌గ‌ల న‌టిగా సావిత్రి గుర్తింపు పొందారు. ఆమె క‌ళ్లు ఎన్నెన్ని భావాలు ప‌లికిస్తాయో వ‌ర్ణిస్తూ… తెలుగు సినిమాల్లో అనేక పాటలు కూడా ఉన్నాయి. అందుకే సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిస్తున్న మ‌హాన‌టి చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ లో ఆ క‌ళ్ల‌నే చూపించారు. మహాన‌టిలో సావిత్రి పాత్ర‌ను పోషిస్తోన్న కీర్తి సురేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు.

క‌ళ్లు మాత్ర‌మే క‌నిపిస్తున్న ఆ బ్లాక్ అండ్ ఫొటో చూసిన వెంట‌నే… అది సావిత్రి ఫొటో అన్న భావ‌న క‌లుగుతుంది. త‌ర‌చి త‌ర‌చి చూస్తే మాత్రం ఆ క‌ళ్లు కీర్తిసురేష్ విగా పోల్చుకోవ‌చ్చు. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ మ‌హాన‌టిని త‌ల‌పిస్తుంద‌ని ఈ ఫ‌స్ట్ లుక్ తో చెప్పేయొచ్చు. అందుకే ఫొటో చూసిన నెటిజ‌న్లు… సావిత్రా లేక కీర్తినా అని కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ స‌మంత సైతం ఆ క‌ళ్ల‌పై కామెంట్ చేశారు. ఆ క‌ళ్ల‌ను ఎవ్వ‌రూ దాచ‌లేర‌ని, ఆ క‌ళ్లే మ‌హాన‌టి జీవిత చ‌రిత్ర‌ను చెప్ప‌బోతున్నాయని స‌మంత ట్వీట్ చేశారు. ఈ ఫొటోకు చిత్ర‌యూనిట్ ఆకాశ వీధిలో అందాల జాబిలి… అని క్యాప్ష‌న్ ఇచ్చింది.