ఆగ‌ని మాట‌ల యుద్ధం…

war of words between north korea and America at United Nation

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అమెరికాను ఉద్దేశించి ఉత్త‌ర‌కొరియా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు కొన‌సాగుతున్నాయి. ఈ సారి ఐక్య‌రాజ్య‌స‌మితి వేదిక‌గా ఉత్త‌ర‌కొరియా అగ్ర‌రాజ్యంపై విరుచుకుప‌డింది. అమెరికా త‌న విధానాలు మార్చుకోక‌పోతే… ఏ క్ష‌ణంలోనైనా అణుయుద్ధం జ‌రుగుతుంద‌ని ఉత్త‌రకొరియా హెచ్చ‌రిక‌లు చేసింది. ద‌క్షిణ కొరియా, జ‌పాన్ ల‌తో క‌లిసి కొరియా ద్వీప‌క‌ల్పంపై అమెరికా వైమానిక విన్యాసాలు నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో ఉత్త‌ర‌కొరియా ఈ వ్యాఖ్య‌లుచేసింది. ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌రల్ అసెంబ్లీ క‌మిటీలో కొరియా రాయ‌బారి కిన్ ఇన్ ర్యాంగ్ అమెరికా చ‌ర్య‌ల‌ను ప్ర‌స్తావించారు.

అమెరికా త‌న విరుద్ధ విధానాల‌ను, అణు హెచ్చ‌రిక‌ల‌ను పూర్తిగా నిలిపివేసేంత వ‌ర‌కు ఉత్త‌ర‌కొరియా క్షిప‌ణి ప్ర‌యోగాల‌కు స్వస్తి ప‌ల‌క‌ద‌ని ర్యాంగ్ తేల్చిచెప్పారు. త‌మ అణ్వాయుధ‌, బాలిస్టిక్ క్షిప‌ణులు ప‌రీక్ష‌లు ఆప‌బోమ‌ని, అమెరికా ప్ర‌ధాన భూభాగం మొత్తం త‌మ ల‌క్ష్య ప‌రిధిలో ఉంద‌ని, ర్యాంగ్ హెచ్చ‌రించారు. ఉత్త‌రకొరియా ప‌విత్ర భూభాగంలో ఒక్క అంగుళంపైనైనా దాడిచేసేందుకు అమెరికా ధైర్యం చేస్తే… ఆ దేశానికి తీవ్ర‌మైన శిక్ష త‌ప్ప‌ద‌ని ర్యాంగ్ వ్యాఖ్యానించారు.

అమెరికా, ఉత్త‌ర‌కొరియా మ‌ధ్య రెండు నెల‌ల నుంచి మాట‌ల యుద్ధం సాగుతోంది. అమెరికా భూభాగ‌మైన గువామ్ పై దాడిచేస్తామ‌ని ఉత్త‌రకొరియా ప్ర‌క‌టించటం ద్వారా మొద‌ల‌యిన వివాదం అంత‌కంత‌కూ ముదిరి అణుయుద్ధానికి దారితీసే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. వ‌రుస క్షిప‌ణి ప్ర‌యోగాలు, హైడ్రోజ‌న్ బాంబు ప‌రీక్ష‌ల‌తో ఉత్తర‌కొరియా అమెరికా, జ‌పాన్ ను రెచ్చ‌గొడుతోంది. ప్ర‌తిగా అమెరికా కూడా దుందుడ‌కు గానే స్పందిస్తోంది. ఉత్త‌రకొరియాతో చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు అగ్ర‌రాజ్యం హోదాలో అమెరికా ప్ర‌య‌త్నించ‌డం లేదు. ఆ దేశంపై ఒక ప‌క్క మాట‌ల యుద్ధం సాగిస్తూ… మ‌రోప‌క్క ఐక్య‌రాజ్య‌స‌మితి ఉత్త‌ర‌కొరియా ఎగుమ‌తుల‌పై ఆంక్ష‌లు విధించేలా అమెరికా పావులుక‌దిపింది. తాము త‌ల‌చుకుంటే ఉత్త‌ర‌కొరియాను స‌ర్వ‌నాశ‌నం చేయ‌గ‌ల‌మ‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి లో చేసిన తొలి ప్ర‌సంగంలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ హెచ్చ‌రించ‌డంతో ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది.

అమెరికా హెచ్చరిక‌ల‌ను, ఐక్య‌రాజ్య‌స‌మితి ఆంక్ష‌ల‌ను లెక్క‌చేయ‌కుండా… ఉత్త‌ర‌కొరియా త‌న‌కు తోచిన‌ప‌ద్ధ‌తిలోనే ముందుకు వెళ్తోంది. దీంతో ఇరుదేశాల మ‌ధ్య యుద్ధం త‌ప్ప‌ద‌నే భావ‌న నెల‌కొంది. అటు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వైఖ‌రిని ప్ర‌తిపక్షాలు కూడా త‌ప్పుప‌డుతున్నాయి. వివాదం మొద‌ల‌యిన తొలిరోజుల్లోనే చైనా మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ట్రంప్ ఉత్త‌ర‌కొరియాతో చ‌ర్చ‌లు జ‌రిపితే బాగుండేద‌ని డెమోక్రటిక్ నాయ‌కురాలు హిల్ల‌రీ క్లింట‌న్ వ్యాఖ్యానించారు. ట్రంప్ త‌న తెలివిత‌క్కువ విధానాల‌తో మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టేలా ఉన్నార‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. మ‌రోవైపు ప్ర‌పంచ దేశాలు కూడా ఈ ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నాయి. ఇప్ప‌టికైనా అమెరికా, ఉత్త‌రకొరియా… చైనా మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో స‌మస్యను ప‌రిష్క‌రించుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని ప‌లు దేశాలు సూచిస్తున్నాయి.