Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇద్దరు సాధ్విలపై అత్యాచారం కేసులో డేరాబాబా దోషిగా నిర్దారణ అయినదగ్గరనుంచి ఆయన పాపాలు రోజుకొకటి వెలుగుచూడడంతో దేశవ్యాప్తంగా ఆయనపైనా, దత్తపుత్రికగా చెప్పుకునే హనీప్రీత్ పైనా ఒకరకమైన ఏహ్య భావం కలిగిందని చెప్పొచ్చు. హనీప్రీత్ గుర్మీత్ బాబా కూతురు కాదని, వారిద్దరి మధ్య వివాహేతర బంధముందని ఆమె మాజీ భర్త విశ్వాస్ గుప్తా మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పడం, ఆశ్రమంలో పనిచేసిన ఇతర వ్యక్తులు కూడా ఈ విషయాన్నిధృవీకరించడంతో… అందరూ ఆ విషయాన్నే నమ్ముతున్నారు. హనీప్రీత్ మాత్రం పోలీసులకు చిక్కేముందు ఓ జాతీయ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్మీత్ బాబాను నాన్న… నాన్న అని పదే పదే చెప్పుకొచ్చింది. ఓ తండ్రి కుమార్తెను ప్రేమగా తాకకూడదా అని కూడా ప్రశ్నించింది.
హనీప్రీత్ ఏ విధంగా చెప్పినప్పటికీ వారిద్దరి మధ్యా తండ్రీ కూతుళ్ల బంధమే ఉందంటే ఎవరూ నమ్మడం లేదు. బాబాతో పాటు హనీప్రీత్ ను అందరూ దోషిగానే చూస్తున్నారు. అయితే అనూహ్యంగా హర్యానా మహిళా కమిషన్ మాత్రం హనీప్రీత్ కు మద్దతుగా వాదిస్తోంది. ఎలాంటి ఆధారాలూ లేకుండా విశ్వాస్ గుప్తా… హనీప్రీత్ పై ఆరోపణలు చేసి, ఆమె పరువు తీస్తున్నాడని ఆరోపించింది. దీనికి సంబంధించి ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ హర్యానా డీజీపీకి లేఖ రాసింది. ఈ విషయాన్ని బీజేపీ నాయకురాలయిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ ప్రతిభ సుమన్ స్వయంగా వెల్లడించారు. 2009లోనే హనీప్రీత్ కు విడాకులు ఇచ్చిన విశ్వాస్ గుప్తా ఇప్పుడు ఆమెపై నిందలు వేయడం ఎంతవరకు సబబు అని ఆమె ప్రశ్నించారు. ఆయనపై మానవ హక్కుల బృందం తనకు ఫిర్యాదుచేసిందని, వారి ఫిర్యాదుమేరకే డీజీపీ బీఎస్ సాంధూకి తాను లేఖరాశానని ప్రతిభ సుమన్ చెప్పుకొచ్చారు.