భారత్లో కరోనా విజృంభిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయంలో పనిచేసే గర్భిణీ ఉద్యోగులక ఊరట కల్పిస్తూ ప్రభుత్వం తీపికబురు అందించింది. హర్యానా సచివాలయంలో పనిచేసే గర్భిణీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం జాయింట్, డిప్యూటీ సెక్రటరీలు, సూపరింటెండెంట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, కార్యదర్శులు తమ విభాగాల్లో పనిచేస్తున్న గర్భిణులకు ఇంటి వద్ద నుంచి పనిచేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గర్భిణీలకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ సీఎంవో కార్యాలయం ట్వీట్ చేసింది. అంతేకాకుండా అంధులు, శారీరక వైకల్యం ఉన్నవారికి సైతం ఇంటి నుంచే పని చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతకుముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సైతం గర్భిణీలు, 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నవారు, పదేళ్ల వయసు పిల్లలున్న ఉద్యోగులు కార్యాలయానికి హాజరు కావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక హర్యానాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40, 054కు చేరుకోగా, 167 మంది మరణించారు.