లాక్ డౌన్ తో ఇంట్లో ఒత్తడి.. ఏడుగురు ఆత్మహత్యాయత్నం

కరోనా వైరస్ ప్రపంచాన్నే అల్లకల్లోలం చేస్తోంది. అన్ని రకాలుగా సమాజాన్ని ధ్వంసం చేస్తుంది. లక్షల మంది ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి అల్లల్లాడి పోతున్నారు. ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. దీంతో ఏ దేశానికి ఆదేశం పటిష్టమైన నియమ నిబంధనలు పెట్టుకొని ఇంట్లోంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటుంది.
అయితే ఈ లాక్‌‌డౌన్ కారణంగా ఇంట్లో ఉండలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులోని సేలం జిల్లాలో ఏకంగా ఏడుగురు ఆత్మహత్యకు యత్నించారు. అసలు జనాలకు ఆఫీసులు, వ్యాపారాలు, ఇంటి పనులంటూ బయట తిరగడం అలవాటైపోయింది. కొందరైతే ఇంట్లో ఉండలేక సినిమాలు, షాపింగ్ అంటూ తిరుగుతుంటారు. ఏదేమైనా రోజుకోసారి బయటకు వెళ్లి రాకపోతే ఏమీ తోచని పరిస్థితి. లాక్‌డౌన్ తో అంతా ఇంటికే పరిమితమౌతున్నారు. ఇంట్లోనే కదలకుండా ఉంటూ ఉక్కిరిబిక్కిరై పోతున్నారు. అటు ఇంట్లో ఉండలేక, బయట తిరగలేక తీవ్ర వత్తిడికి గురౌతున్నారు. నిదానంగా ఇదో మానసిక సమస్యగా మారింది. ఇదే వత్తిడికి లోనై తమిళనాడులోని సేలం జిల్లాలో ఐదుగురు మహిళలతో పాటు మొత్తం ఏడుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్‌‌ను పకడ్బంధీగా అమలు చేస్తోంది. దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. దీంతో ప్రజలంతా రోడ్లపైకి వస్తే అరెస్ట్‌ చేయడం, కేసులు పెట్టడం, వాహనాలను సీజ్‌ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో సీలం జిల్లా ఆత్తూరులో కాట్టుకోట్టై ప్రాంతానికి చెందిన అయ్యనార్‌మలై అనే వ్యక్తి విషపుమొక్కను నీళ్లలో కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చుట్టుపక్కల వారు గమనించి అతడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే… మరొకరు ఆత్తూరు సమీపంలోని పెత్తనాయకన్‌పాళయంకు చెందిన మణికంఠన్‌ (24) విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చతురంగపట్టికి చెందిన అర్ముగం కుమార్తె సుహాసిని పొటాషియం సల్ఫేటు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంకా నర్సింగ్‌పురం కలైంజ్ఞర్‌ కాలనీకి చెందిన రాజేశ్వరి విషం తాగింది.
ఆత్తూరు సమీపం నరసింగపురానికి చెందిన గుణశేఖరన్‌ భార్య సుధ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. తలైవాసల్‌ పట్టుదురై గ్రామానికి చెందిన ప్రియాంక గన్నేరుపప్పు మింగి ఆత్యహత్యాయత్నం చేసింది. అదే ప్రాంతానికి చెందిన శివశంకరన్‌ భార్య తేన్‌మొళి పురుగుల మందు తాగింది. వీరంతా లాక్‌డౌన్ కారణంగా రెండ్రోజులుగా ఇంటికే పరిమితం కావడంతో ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లాక్‌డౌన్ పొడిగిస్తారనే ప్రచారం కూడా కొందరిని కుంగదీస్తోందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు.