Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారీ వరదలతో అతలాకుతలమైన బీహార్ కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం ప్రకటించారు. వరద నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా అంచనా వేసిన ప్రధాని ఆ రాష్ట్రానికి తక్షణమే రూ. 500 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. వరద తీవ్రతను పరిశీలించేందుకు ఓ కేంద్ర బృందాన్ని బీహార్ కు పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. వరదల కారణంగా బీహార్ అతలాకుతలమైంది. అనేక గ్రామాలు నీటమునిగి, భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.
వరదల్లో ఇప్పటిదాకా 400 మందికి పైగా మరణించారని సమాచారం. వరద నీటితో అనేక గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం అనేకమందిని పునరావాస శిబిరాలకు తరలించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు సహాయకకార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రధాని ఇవాళ బీహార్ వచ్చారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీతో కలిసి ప్రధాని ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు.
అనంతరం సీనియర్ అధికారులతో వరదపరిస్థితిపై సమీక్షించారు, బీహార్ ప్రజల సాధారణ జీవితం గాడిలో పడేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకోవాలనీ, కేంద్రం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని పీఎం హామీ ఇచ్చారు. బీహార్ లో ఇటీవలే బీజేపీ మద్దతుతో జేడీయూ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్లకే బీహార్ ను భారీ వరదలు ముంచెత్తడంతో…..కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రప్రభుత్వానికి సహకరిస్తోంది. అటు బీహార్ తో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగ, అసోం రాష్ట్రాల్లోనూ వరదల ధాటికి ప్రజలు అల్లాడుతున్నారు.
మరిన్ని వార్తలు:
మూడు క్షిపణులు ప్రయోగించిన ఉత్తరకొరియా
పురంధేశ్వరికి కలిసి రాని కాలం