Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన మలయాళ నటి ప్రియ ప్రకాశ్ వారియర్ నటించిన ఒరు అదార్ లవ్ చిత్రంలోని మణిక్య మలరాయ పూవి పాట వెనక ఆసక్తి కర విషయాలు ఉన్నాయి. సాధారణంగా ఓ సినిమా ఫైనలైజ్ అయిన తర్వాత సందర్భానికి తగ్గట్టు అందులో మాటలు, పాటలు రాస్తారు. కానీ మణిక్య మలరాయ పూవి పాట అలా ఒరు అదార్ లవ్ కోసం రాసింది కాదు. పీఎంఏ జబ్బర్ అనే వ్యక్తి 1978లో ఈ పాట రాశారు. అప్పటినుంచి ఉత్తరకేరళలో ముస్లింలు మాప్పిలప్పట్టు పేరుతో ఈ పాట పాడుకుంటున్నారు. ఈ పాట 1978లోనే ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లో ప్రసారమైంది. థలస్సెరీ కె. రఫీక్ రేడియో, టీవీల్లో ఈ పాట పాడారు.
మల్ బార్ ప్రాంతంలో బాగా పాపులర్ అయిన ఈ పాటను అక్కడ జరిగే పెళ్లిళ్లలో తప్పనిసరిగా వేస్తారు. మలయాళం, అరబి మలయాళం, ఉర్దు, పర్షియన్ భాషల్లోనూ ఈ పాటను మిక్స్ చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శిస్తారు. కేరళ ముస్లింలు ఈ పాటకు అక్కడి సంప్రదాయ నృత్యం చేస్తుంటారు కూడా. ఈ పాట రాసేటప్పుడు జబ్బర్ వయసు 20 ఏళ్లు. కేరళలోని త్రిస్సూర్ లో మదర్ సా ఉపాధ్యాయునిగా ఆయన పనిచేశారు.
సుమారు 100 పాటలు రాశారు. ప్రస్తుతం ఆయన సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఓ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన అంగీకారంతోనే ఆ పాటను ఒరు అదార్ లవ్ లో ఉపయోగించారు. ఈ పాట దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అదే సమయంలో దీనిపై వివాదం కూడా చెలరేగింది. పాటలో వాక్యాలు ముస్లింలను కించపరిచేలా ఉన్నాయని కేసు కూడా నమోదయింది. దీనిపై జబ్బర్ స్పందించారు. ఈ పాట విడుదల గురించి తనకు తెలుసని, షాన్ రెహమాన్ మంచి సంగీతం అందించారని, ఉమర్ లులూ చాలా చక్కగా పాటను చిత్రీకరించారని ప్రశంసించారు. పాటకు సంబంధించిన వివాదం తన దృష్టికి వచ్చిందని, కొత్త పాట, సినిమా వచ్చిన సమయంలో ప్రజలు విభిన్నమైన అభిప్రాయాలతో వస్తుంటారని జబ్బర్ అభిప్రాయపడ్డారు.