ప్రముఖ పాత్ర పోషిస్తున్న ప్రియమణి

ప్రముఖ పాత్ర పోషిస్తున్న ప్రియమణి

కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో తెరకెక్కుతున్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌ తలైవిలో జయలలిత సన్నిహితురాలు శశికళ పాత్రలో ప్రముఖ నటి ప్రియమణి కనిపించనున్నట్టు సమాచారం. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో మూడు భాషల్లో రూపొందుతున్న ఈ మూవీలో శశికళ పాత్ర ఎవరికి దక్కుతుందనేది మొదటి నుంచీ ఆసక్తికరంగా మారింది. శశికళ పాత్రకు ప్రియమణి సరిగ్గా సరిపోతారని భావించిన దర్శకుడు విజయ్‌ ఆమెను ఒప్పించినట్టు తెలిసింది.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న తలైవిలో పాన్‌ ఇండియా అప్పీల్‌ను తీసుకువచ్చేందుకు ప్రియమణి ఎంట్రీ కలిసివస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. జయలలిత జీవితాన్ని శశికళ అధికంగా ప్రభావితం చేయడంతో మూవీలో ఈ పాత్ర కీలకంగా మారింది. కాగా ప్రియమణి ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ ఒరిజినల్స్‌ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌లో బిజీగా ఉండగా, ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్‌ థ్రిల్లర్‌ సిరివెన్నెల మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.