Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హాలీవుడ్ నిర్మాత హార్వే పదుల సంఖ్యలో నటీమణుల్ని లైంగిక వేధింపులకు గురి చేశాడన్న న్యూయార్క్ టైమ్స్ కధనం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ రంగంలో కాస్ట్ కౌచింగ్ మీద చర్చ మొదలైంది. “ మీ టూ” టాగ్ లైన్ తో అన్ని రంగాల్లో వేధింపులకు గురి అయిన మహిళలు గొంతు ఎత్తడంతో లైంగిక వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రపంచానికి అర్ధం అయ్యింది. ఇదంతా మగోళ్ళు కామ ప్రకోపం వల్లే అనుకోవడం సహజం. కానీ అది నిజం కాదు అంటోంది ఇటు బాలీవుడ్ అటు హాలీవుడ్ లో పనిచేసిన ప్రియాంక చోప్రా. సినిమా సహా అన్ని రంగాల్లో మగవాడి వికృత చేష్టల వెనుక వున్న మనస్తత్వ కోణాన్ని ప్రియాంక బయటపెట్టింది.
నిజంగా సెక్స్ కోసమే మగవాళ్ళు తమ దగ్గర పనిచేసే ఆడవాళ్ళని వేధించరట. అందుకు ప్రధాన కారణం ఇగో అట. తన దగ్గర పనిచేసే ఆడదాన్ని లొంగదీసుకున్నానన్న మగ అహంకారాన్ని తృప్తి పరుచుకోడానికి పురుషులు ఈ పని చేస్తారట. పని జరిగే చోట పెత్తనమంతా తమదే అని చెప్పుకోడానికి ఈ లైంగిక వేధింపుల్ని ఓ ఆయుధంగా వాడతారట. అందుకే ఈ లైంగిక వేధింపుల నుంచి తప్పించుకోవాలంటే ముందుగా ఆడవారిలో ఆత్మవిశ్వాసం పెరగాలని సూచిస్తోంది ప్రియాంక.
సెక్స్ వేధింపులు అనగానే మగవాడిని కామపిశాచిగా చూసే రొటీన్ డైలాగ్స్ కాకుండా దాని వెనుక వున్న కారణం తెలుసుకునేందుకు ప్రియాంక ప్రయత్నించడం మెచ్చుకోదగిన విషయమే. ఏ సమస్యకి అయినా పైపైన చూస్తే ప్రచారం దొరుకుతుందేమో గానీ పరిష్కారం దొరకదు. ఆ దిశగా అడుగు వేస్తున్న ప్రియాంకకి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.