ఫిదా కాదని బొమ్మరిల్లు సెంటిమెంట్‌..!

Producer Dil Raju to follow Bommarillu Movie sentiment

దిల్‌రాజు బ్యానర్‌లో తెరెక్కుతున్న ‘శ్రీనివాస కళ్యాణం’ ను మొన్నటి వరకు జులైలో ఫిదా విడుదలైన తేదీన విడుదల చేయాలని భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ‘బొమ్మరిల్లు’ సెంటిమెంట్‌తో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న శ్రీనివాస కళ్యాణం చిత్రం విడుదల తేదీపై దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని ఆగస్టు 9న విడుదల చేయాలని నిర్ణయించాడు. దిల్‌ రాజు బ్యానర్‌లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌గా బొమ్మరిల్లు నిలిచిన విషయం తెల్సిందే. ఆ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించి, చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికి కూడా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అంటే సినిమా ఏరేంజ్‌లో ఉంటుందో చెప్పుకోవచ్చు.

‘బొమ్మరిల్లు’ సూపర్‌ హిట్‌ అయిన కారణంగా అదే రోజున ‘శ్రీనివాస కళ్యాణం’ను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. గత సంవత్సరం శతమానం భవతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు సతీష్‌ వేగేశ్న ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో హీరోగా నితిన్‌ నటించగా, హీరోయిన్‌గా రాశిఖన్నా నటించిన విషయం తెల్సిందే. ఫస్ట్‌లుక్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తేశారు. భారీ ఎత్తున ఈ చిత్రంను ఆగస్టు 9న విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.