అమెరికాలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు నిరసన సెగ తగలింది. జిన్‌పింగ్ రాకను నిరసిస్తూ అమెరికాలో.. వందలాది మంది నిరసనకారులు ఆందోళనకు దిగారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేయగా.. మరికొందరు తైవాన్, టిబెట్ జెండాలను పట్టుకుని నిరసన తెలిపారు. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు జరుగుతున్న మాస్కోన్ సెంటర్ సమీపంలోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించిన వారిని స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు డ్రాగన్ మద్దతుదారాలు జిన్‌పింగ్‌కు స్వాగతం అని ఉన్న ప్లకార్డులతో చైనా అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు.
శాన్ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సుకు బైడెన్ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం కాలిఫోర్నియాలో ఇరు దేశాల అధ్యక్షులు సమావేశమై.. ద్వైపాక్షిక సంబంధాలు, తైవాన్ అంశం, వాతావరణ మార్పులు, మాదక ద్రవ్యాల రవాణాను ఎదుర్కోవడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, దక్షిణ చైనా సముద్రంలో అలజడులు, వాణిజ్యం, రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలపై చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి.. అపోహలను తొలగించుకునేందుకు ఈ భేటీ ఉపయోగపడుతుందని చైనా, అమెరికా అధ్యక్షులు భావిస్తున్నారు.