టీఆర్ఎస్-వైసీపీ లోపాయికారీ ఒప్పందాన్ని బయట పెట్టిన కమెడియన్…!

Prudhvi Raj About YS Jagan Mohan Reddy And Kcr

తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడంలేదు. అలాగని రాష్ట్రంలోని ఏ పార్టీకీ మద్దతిస్తామని అధికారికంగా కూడా ప్రకటించలేదు. అయితే, తెలంగాణకు చెందిన వైసీపీ నేతలు మాత్రం టీఆర్ఎస్ పార్టీకే సపోర్టు చేస్తున్నారు. ఈ మేరకు కొద్దిరోజులుగా వార్తలు కూడా వస్తున్నాయి. పైకి మద్దతు ప్రకటించకపోయినా కేసీఆర్-జగన్ దోస్తీ వల్లే వైసీపీ.. గులాబీ పార్టీకి అండగా ఉందని ప్రచారం జరుగుతోంది. తాజాగా కూకట్ పల్లిలో సమావేశం అయిన తెలంగాణా నేతలు తెరాసకే మద్దతిస్తామని ప్రకటన చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆ పార్టీకి వీరాభిమాని, ప్రముఖ సినీ నటుడు పృథ్వీ మాటలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. కొద్దిరోజుల క్రితం హాస్యనటుడు పృథ్వీ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను కలిశారు. వీరవసరం మండలం మెంతెపూడి క్రాస్ నుంచి వైసీపీ జెండాను పట్టుకుని జగన్ వెంట నడిచాడు పృథ్వీ. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తనది పశ్చిమ గోదావరి జిల్లా అని, జగన్ అంటే తనకు ఇష్టమని, వచ్చే ఎన్నికల్లో ఆయనే సీఎం అవుతాడని జోస్యం చెప్పాడు.

prudvi-raj

అయితే, అంతకు ముందే వైసీపీ నేతలు పోసాని ఇచ్చిన సమాచారంతో పృథ్వీని కలిశారని, అప్పుడు ఆయన ఆ పార్టీలోకి వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేశారని, అందుకే పని కట్టుకుని వచ్చి మరీ జగన్‌కు మద్దతు తెలిపినట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు, ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని, ఇందులో భాగంగా పృథ్వీకి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం టికెట్ ఇస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ మగాడని సింహం సింగిల్‌గా వస్తుందన్నట్టు ఆయన ప్రయాణం ఉంటుందన్నారు. తెలంగాణలో ఎన్ని పార్టీలు వచ్చినా ఏం కాదని టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు. కేసీఆర్‌కు అనైతిక కలయికలు లేవని కానీ మహాకూటమి అధికారం కోసమే పని చేస్తోందన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేసిన తెలంగాణ గడ్డపై మహాకూటమికి ఓటేస్తే అమరావతి నుంచి పాలన ఉంటుందని విమర్శించారు. కేసీఆర్‌కు సరితూగే నాయకుడు ఎవరూ లేరని కాంగ్రెస్ విడిగా పోటీ చేసి ఉంటే ఐదారు సీట్లు వచ్చేవని వ్యాఖ్యానించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన పృథ్వీ.. ఇక్కడ టీఆర్ఎస్‌ను గెలిపించమని కోరుతుండడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆ రెండు పార్టీల లోపాయికార ఒప్పందం ప్రకారం తెలంగాణలోని వైసీపీ ఓట్లు టీఆర్ఎస్‌కు పడబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది.

YSRCP Extends Support To TRS Nominee In Kukatpally