Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
15 ఏళ్ల క్రితం భారత క్రికెట్ ను ఓ కుదుపు కుదిపిన ఫిక్సింగ్ భూతం మరోసారి ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటిదాకా ఆటగాళ్లే ఫిక్సింగ్ కు పాల్పడతారని భావిస్తుండగా…పిచ్ క్యూరేటర్ సైతం బుకీలతో కుమ్మక్కై మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలరన్న నిజం తెలిసొచ్చింది. ఇటీవల వన్డేలు, టీ20ల్లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ న్యూజిలాండ్ తో తొలి వన్డేలో మాత్రం ఓడిపోయింది. దీంతో పూణెలో జరిగే రెండో వన్డేను ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు సంచలన విషయం వెలుగుచూసింది. ఇండియా టుడే నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో పిచ్ క్యూరేటర్ పాండురంగ్ సల్గావోంకర్ బుకీలు చెప్పినట్టు పిచ్ తయారుచేశాడని వెల్లడయింది. స్ట్రింగ్ ఆపరేషన్ లో భాగంగా ఇండియా టుడే రిపోర్టర్లు క్రికెట్ బుకీల రూపంలో పాండురంగ్ వద్దకు వెళ్లారు. వచ్చింది బుకీలే అనుకున్న పాండురంగ్…వారిని పిచ్ దగ్గరకు తీసుకువెళ్లాడు. పిచ్ ఎలా కావాలంటే అలా రెడీ చేస్తానని వారితో చెప్పాడు.
ఒకరిద్దరు ఆటగాళ్లు బౌన్సీపిచ్ కావాలని కోరుతున్నారని, అలా మార్చే అవకాశం ఉందా..అని రిపోర్టర్లు అడగ్గా…సరే..పిచ్ ను అలాగే మారుస్తా..అని పాండురంగ్ బదులిచ్చాడు. పిచ్ బ్యాటింగ్ కు సహకరించేలా తయారుచేస్తానని, 337 నుంచి 340 పరుగులు చేసే అవకాశం ఉందని, ఈ లక్ష్యాన్ని చేధించవచ్చని తెలిపాడు. పర్యాటక జట్టుకు అనుకూలంగా ఉండేలా…ఈ పిచ్ తయారుచేసినట్టు..పాండురంగ్ మాటల్లో స్పష్టంగా అర్ధమయింది. పిచ్ కు సంబంధించిన రిపోర్టు మొత్తం బుకీలు అనుకుని ఇండియాటుడే రిపోర్టర్లకు అందించాడు పాండురంగ్..ఆయన మాటల ఆడియో, వీడియో టీవీ చానల్ లో ప్రసారం కావడంతో పెను సంచలనం చెలరేగింది. తక్షణమే రంగంలోకి దిగిన బీసీసీఐ పాండురంగ్ ను సస్పెండ్ చేసింది. ఆయనపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. క్రికెట్ నియమనిబంధనలు గురించి ప్రతి ఒక్క ఉద్యోగికి, అధికారికి తెలుసని, డబ్బు కోసం ఇలా చేయడం తీవ్రమైన తప్పని బీసీసీఐ ప్రతినిధి అమితాబ్ చౌదరి వ్యాఖ్యానించారు. నిజానికి పిచ్ ల తయారీ లో ఈ రకమైన ఫిక్సింగ్ ఇప్పటిదాకా వెలుగుచూడలేదు.
క్రికెట్లో పిచ్ తీరును బట్టి మ్యాచ్ ఫలితాలు మారిపోతుంటాయి. సాధారణంగా…ఏ దేశమైనా ఆతిథ్య జట్టుకు అనుకూలంగా పిచ్ ను తయారుచేసుకుంటుంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టయితే…బ్యాటింగ్ పిచ్ ను, బౌలింగ్ కు అనుకూలంగా ఉండే మైదానం అయితే బౌలింగ్ పిచ్ ను తయారుచేస్తారు. అయితే బౌలింగ్ పిచ్ అయినా,బ్యాటింగ్ పిచ్ అయినా ఐసీసీ నిబంధనలకు లోబడే పిచ్ ను తయారుచేయాలి. అందుకే….పిచ్ అనుకూలంగా ఉన్పప్పటికీ …అన్ని మ్యాచ్ ల్లోనూ ఆతిథ్య జట్టే గెలవదు. పర్యాటక జట్టూ విజయాలు సాధిస్తుంది. సిరీస్ లు కైవసం చేసుకుంటుంది. కానీ క్యురేటర్ బుకీలతో ఫిక్స్ అయితే…ఐసీసీ నిబంధనలు పక్కనపెట్టిమరీ…బుకీలు కోరినట్టుగా పిచ్ రూపొందించే అవకాశం ఉంది. పుణే పిచ్ ను క్యూరేటర్ పాండురంగ్ బహుశా ఇలానే తయారుచేసుండవచ్చు. అందుకే ఆయన రిపోర్టర్లతో 340 పరుగులను చేధించవచ్చని నమ్మకంగా చెప్పాడు. ఈ స్ట్రింగ్ ఆపరేషన్ తర్వాత మొదటి వన్డేలో న్యూజిలాండ్ గెలుపుపైనా అభిమానుల్లో సందేహాలు కలుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు క్రికెట్ పై సాధారణ అభిమానులు నమ్మకం కోల్పోయేలా చేస్తాయి.
మ్యాచ్ గెలుపోటములు..క్రికెటర్ల ఆటతీరును బట్టి కాకుండా..బుకీల ఇష్టప్రకారం ఉంటాయంటే….సగటు అభిమానికి ఆట చూడాలన్న ఆసక్తే పోతుంది. మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత ఇదే జరిగింది. ఎవరు గెలవాలో ముందే నిర్ణయమైపోయిన మ్యాచ్ లను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపలేదు. భారత క్రికెట్ కు అవి దుర్దినాలు. ఒకానొక దశలో క్రికెట్ ను అభిమానులు ద్వేషించిన పరిస్థితి ఏర్పడింది. ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన ఆటగాళ్లపై నిషేధం విధించడం, కెప్టెన్ గా గంగూలీ నియమితుడవ్వడం, ఆటగాళ్ల దృక్పథంలో మార్పురావడంతో భారత క్రికెట్ తిరిగి గాడిన పడింది. ఆ ఉదంతం తర్వాత అడపాదడపా ఇలాంటి ఘటనలు వెలుగుచూసినపప్పటికీ పిచ్ క్యూరేటరే బుకీలతో కుమ్మక్కైన తాజా ఘటన మాత్రం మళ్లీ క్రికెట్ పై అనేక సందేహాలను లేవనెత్తుతోంది.