పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఒక సామాన్య వ్యక్తిని సీఎంగా చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రానికి మొదటి దళిత సీఎంగా చన్నీ నిలిచిన సంగతి తెలిసిందే.
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్‌మధ్య నెలరోజుల పాటు సాగిన సంకక్షోభం నేపథ్యంలో కెప్టెన్ పదవినుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అనూహ్యంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని కొత్త సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దీంతో చన్నీ సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తక్షణమే సాండ్ మాఫియాపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అంతేకాదు రైతు పోరాటానికి పూర్తిగా మద్దతు ప్రకటించారు. స్వయంగా రిక్షా పుల్లర్‌ని అయిన తాను వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే నల్ల చట్టాలను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానన్నారు. అటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరైన ఈ వేడుకకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాకపోవడం గమనార్హం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చన్నీకి కాంగ్రెస్ పెద్దలు, పలువురు నేతలతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకూడా శుభాకాంక్షలు అందజేశారు.