రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన పంజాబ్‌ బాలికలు

punjab girls wrote letter to president with blood

చండీగఢ్‌: తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ పంజాబ్‌లోని మోగాకు చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు రక్తంతో లేఖ రాశారు. అన్యాయంగా తమను చీటింగ్‌ కేసులో ఇరికించి తమపై రెండు తప్పుడు కేసులు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. వీసా మోసం, ఐపీసీ 420 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారన్నారు. దర్యాప్తు చేసి నిజాలు నిగ్గుతేల్చాల్సిందిగా ఎన్నిసార్లు పోలీసులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగకపోతే కుటుంబాన్ని మొత్తం స్వచ్ఛంద మరణానికి అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్రపతిని కోరారు. దీనిపై మోగా పోలీస్‌ అధికారి కుల్జిందర్‌ సింగ్‌ స్పందిస్తూ.. బాలికల ఆరోపణలను కొట్టిపారేశారు. ఇద్దరిపై క్రిమినల్‌ కేసులు నమోదైనట్లుగా తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతుందన్నారు. సెక్యూరిటీపై ఓ చెక్‌ను వీరు తీసుకున్నారు. విదేశాల్లో ఉన్న కొడుకుకు డబ్బు పంపించే నిమిత్తం ఓ కుటుంబం ఏజెంట్లుగా భావించి వీరికి నగదు ఇచ్చినట్లుగా సమాచారం. బాలికలు రాష్ట్రపతికి లేఖ రాసినట్లుగా తెలిసింది. కాగా దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఇప్పటివరకు తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. సమన్లు పంపించినప్పటికీ ఫిర్యాదుదారులు దర్యాప్తుకు సహకరించడం లేదన్నారు. కేసును తర్వలోనే పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.