2014 ఎన్నికల్లో కలిసి పోటీచేసిన తర్వాత…కొన్నాళ్లు టీడీపీ, బీజేపీ మిత్ర బంధం బాగానే ఉన్నా..మోడీ, అమిత్ షా వ్యూహాలతో తర్వాతిరోజుల్లో ఆ బంధం బీటలు వారింది. ఎన్నికలసమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా తో పాటు అనేక హామీలు నెరవేర్చకపోవడం, వైసీపీకి దగ్గరయ్యేందుకు మోడీ ప్రయత్నించడం వంటి కారణాలు టీడీపీకి, కేంద్రానికి మధ్య దూరం పెంచాయి. అయితే ఇటీవలి కాలంలో మోడీ, అమిత్ షాల వైఖరిలో మార్పు వచ్చింది. ఏపీలో టీడీపీకి జనాదరణ ఏమాత్రం తగ్గకపోవడం, విభజన హామీలు నెరవేర్చని కారణంగా రాష్ట్రంలో బీజేపీపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశమున్నట్టు వస్తున్న ఊహాగానాలతో కేంద్రం అలర్టయింది.
టీడీపీని దూరంచేసుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని, ఏపీలో సొంతంగా ఎదిగే అవకాశం ప్రస్తుత పరిస్థితిల్లో బీజేపీకి లేదని ఆ పార్టీ అగ్రనాయకత్వం అర్ధం చేసుకుంది. దీంతో నెమ్మదిగా మళ్లీ చంద్రబాబుతో మోడీ సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న తనను కలిసి ఏపీ టీడీపీ, బీజేపీ ఎంపీలతో మోడీనే స్వయంగా…రెండు, మూడు రోజుల్లో తాను, చంద్రబాబుతో సమావేశం కాబోతున్నానని కూడా తెలియజేశారు. ఏపీ ఎంపీలతో ఎంతో సాదరంగా మాట్లాడారు. ఇలా బీజేపీ కేంద్ర నాయకత్వం టీడీపీతో సుహృద్భావంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు.
చంద్రబాబుపై మోడీ, షాలకు లేనిపోనివి కల్పించి చెప్పి…వారి మధ్య అగాధం పెంచింది రాష్ట్ర బీజేపీ నేతలేనని వినిపించిన ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు. కొన్ని రోజుల క్రితం సోము వీర్రాజు, తాజాగా పురంధరేశ్వరి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ ఆరోపణలు నిజమే అనిపిస్తుంది. మోడీ రాష్ట్ర ఎంపీలతో సానుకూలంగా మాట్లాడిన తర్వాతి రోజే…టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారు పురంధరేశ్వరి. పరిపాలన విషయంలో టీడీపీ తప్పులుచేస్తూ..ఆ తప్పులను కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తోందని పురంధరేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు 80 శాతం నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయని, మిగిలిన 20 శాతం నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని విమర్శించారు. నిధుల కేటాయింపులకు సంబంధించి అనేక ఆరోపణలు తమ వరకు వచ్చాయన్నారు. మిత్రపక్షమైన టీడీపీ ఇలాగే వ్యవహరిస్తూ పోతే…2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ సామర్థ్యాన్ని బట్టి బీజేపీ పోటీచేస్తుందని తెలిపారు. పురంధరేశ్వరి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మోడీ, టీడీపీతో చెలిమి కోరుకుంటోంటే…పురంధేశ్వరి అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం పలు సందేహాలు కలిగిస్తోంది.