ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్, భారత ప్లేయర్ పీవీ సింధు కొత్త పాత్రలో అలరించనుంది. ప్రముఖ స్పోర్ట్స్ మార్కెటింగ్ సంస్థ బేస్‌లైన్ వెంచర్స్ నిర్మిస్తోన్న క్రీడలకు సంబంధించిన ‘ది ఎ–గేమ్’ వెబ్ సిరీస్‌కు సింధు వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. మేటి విజయాలతో భారత్‌కు పేరు ప్రఖ్యాతులు సాధించి పెట్టిన క్రీడాకారులు తమ అనుభవాలను ఈ కార్యక్రమంలో పంచుకోనున్నారు.
ఐదు ఎపిసోడ్ల పాటు సాగే ఈ కార్యక్రమంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, రెజ్లర్ సాక్షి మలిక్… షూటర్ గగన్ నారంగ్… లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్… ఫుట్‌బాలర్ బైచుంగ్ భూటియా… స్నూకర్–బిలియర్డ్స్ స్టార్ పంకజ్ అద్వానీలతో సింధు ముచ్చటించనుంది. దీనిపై ఆమె స్పందిస్తూ ‘ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఒత్తిడి సమయంలో దిగ్గజ అథ్లెట్ల ఆలోచనా విధానాన్ని వారి శక్తి సామర్థ్యాల్ని ఈ షో ద్వారా తెలుసుకోవచ్చు’ అని వ్యాఖ్యానించింది. ఈ కార్యక్రమం యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మాధ్యమాల్లో ప్రసారం కానుంది. బేస్‌లైన్ వెంచర్స్ ఇప్పటికే ‘డబుల్ ట్రబుల్’, ‘ఫినిష్ లైన్’ పేరిట నిర్మించిన రెండు వెబ్ సిరీస్‌లు విజయవంతమయ్యాయి.