పీవీపీగా పిలుచుకునే పొట్లూరి వరప్రసాద్… ఈ పేరు వినగానే ప్రముఖ పారిశ్రామికవేత్తే కాకుండా చాలా కాలం నుంచి రాజకీయాల్లో సత్తా చాటాలని తహతహలాడుతున్న నేత మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కసారైనా ఎంపీగా పనిచేయాలన్న ఆయన కోరిక ఇప్పటికీ తీరకపోవడంతో ఇంకెప్పుడు అన్నట్లుగా సాగుతున్న పీవీపీ… మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ట్విట్టర్ లో యమా యాక్టివ్ అయిపోయారు. తనను ఓడించిన టీడీపీ నేత, ఎంపీ కేశినేని నాని, ఇతర టీడీపీ నేతలను తనదైన శైలిలో దునుమాడుతూ పీవీపీ పెట్టే ట్వీట్లు నిజంగానే ఆసక్తి రేపుతున్నాయని చెప్పక తప్పదు. వైసీపీలో కొనసాగుతున్న పీవీపీ… బుధవారం తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టి.. వెనువెంటనే దానిని తొలగించారు. ఆ ట్వీట్ ఇప్పుడు వైసీపీలో ప్రకంపనలు రేపుతోందని చెప్పక తప్పదు. అయినా ఆ పోస్టులో పీవీపీ ఏమని ట్వీటారంటే… ఏపీకి మహిళా సీఎంను చూడాలనుందంటూ ఆయన సంచలన విషయాన్ని పోస్ట్ చేశారు.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కోర్టులో ఏ క్షణమైనా విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తుండటం, ఈ కేసులో జగన్ అరెస్ట్ కావడం ఖాయమంటూ టీడీపీ నేతలు చెబుతుండటం, జగన్ జైలుకెళితే… సీఎంగా ఆయన భార్య భారతి రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపడతారని కూడా టీడీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో పీవీపీ ట్వీట్ అత్యంత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. అయినా ఇప్పుడు మహిళా సీఎంను చూడాలనుందంటూ పీవీపీ ఎందుకు ట్వీటారన్నది ఆసక్తి రేపుతుంటే… జగన్ జైలుకెళ్లడం ఖాయమని నిర్ధారించుకున్న తర్వాతే పీవీపీ ఈ ట్వీట్ పెట్టారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా వైసీపీ నేతగా కొనసాగుతూ ఆ పార్టీ అధినేతను ఇరుకునపెట్టేలా ట్వీటిన పీవీపీ… వైసీపీపైనా, జగన్ పైనా ఓ రేంజిలో విరుచుకుపడుతున్న టీడీపీ నేతలకు ఓ మంచి అవకాశాన్ని కల్పించారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
సరే.. పీవీపీ తన ట్వీట్ ను ఏ రీతిన కొనసాగించారన్న విషయానికి వస్తే… ‘‘బూజుపట్టిన సంప్రదాయాలకు తెరదించుతూ, మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్డర్లను తీసుకోరు అన్న ప్రభుత్వం వాదనను పక్కనపెట్టి, కొత్త శకానికి నాంది పలికిన సుప్రీమ్‌కోర్ట్. ఆనాడు, అన్న NTR గారు, ఆడవారికి సమాన ఆస్తి హక్కులు కల్పించి మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా, మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధుల్లో సగం, ప్రభుత్వంలో సగం’’ తనదైన శైలి ట్వీట్ ను సంధించిన పీవీపీ… చివరలో ‘నమస్కారం’ సింబల్ యాడ్ చేసి ట్వీట్ ను ముగించారు. మరి ఈ ట్వీట్ వైసీపీలో ఏ మేర ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. అంతేకాకుండా ఈ ట్వీట్ ను టీడీపీ ఏ రీతిన క్యాష్ చేసుకుంటుందోనన్న ఆసక్తి కూడా నెలకొంది.