అతనొక జెఎన్టియూ పూర్వ విద్యార్థి, అమెరికాలో నెలకు లక్షలలో జీతం అందుకునే ఐటీ నిపుణుడు. అయినా అవేమి సంతోషం ఇవ్వలేని పరిస్థితులలో తనకేమి ఆనందం ఇస్తుందో తెలుసుకొని, 14 ఏళ్ళ క్రితం అమెరికా నుండి ఇండియాకి వచ్చి, ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు ధ్యానం మరియు స్వీయ సహకారం వంటి వాటితో చైతన్యపరుస్తూ ముందుకు సాగుతూ, ప్రజల్లో మార్పు తేవడమే తన లక్ష్యమని, పాలనలో మార్పు తేగలిగేది తత్వవేత్తలే అనే నినాదంతో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి పిరమిడ్ పార్టీ అఫ్ ఇండియా పార్టీ తరపున ఎన్నికల్లో నిలబడిన 39 ఏళ్ళ ప్రదీప్ అనిరుధ్ ఇప్పుడు తన వ్యక్తిత్వంతో ప్రజల అభిమానం చూరగొంటున్నాడు. ఇలా ఎన్నికల్లో నిలబడడం ఇది తొలిసారి కాకపోయినా, సనత్ నగర్ మరియు పాండిచ్చేరి నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయినా, డిసెంబర్ 7 న జరుగనున్న ఎన్నికల్లో విజయం సాధిస్తాననే విశ్వాసంతో ప్రజల్లోకి వెళ్తున్నాడు.
ప్రదీప్ అనిరుధ్తో సంభాషణ ప్రారంభిస్తే చాలు తత్వవేత్తలైన అరిస్టాటిల్, కన్ఫ్యూషియస్ మరియు లాఓ తిజు ల ఫిలాసఫీలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సరిపోలుస్తున్నాయో అని తన వివరణలతో ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు.పిరమిడ్ పార్టీ అఫ్ ఇండియా పార్టీ తరపున 41 మంది అభ్యర్థులు రాష్ట్రంలో పోటీచేస్తుండగా, ” శాఖాహారం, ధ్యానం మరియు ఆధ్యాత్మిక దృక్పథం వంటి విధానాల ద్వారా ప్రజలను చైతన్యపరిచి, శాంతి స్థాపనే లక్ష్యంగా, యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించడమే తమ ఎజెండా” అని ప్రదీప్ పేర్కొన్నారు. 1999 నుండి పిరమిడ్ పార్టీ అఫ్ ఇండియా ఎన్నికల్లో పోటీచేస్తుండగా, ఇంతవరకు ఒక్క సీటు కూడా గెలవకపోవడం గమనించాల్సిన విషయం అయినప్పటికీ, గెలవడం కన్నా నిలబడడం ముఖ్యం అనేదే తమ నినాదంగా వర్ణించారు.