కరోనా టైం.. లాక్ డౌన్ సమయం. ఇలాంట కాలంలో క్వారంటైన్ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. పాము కాటుకు గురై ఆరేళ్ల బాలిక ప్రాణాలు విడిచింది. కరోనా సోకినా ఆ బాలిక బతికేదేమో గానీ.. అధికారుల నిర్లక్ష్యానికి ఆ పాప బలి అయింది. సరైన వసతులు లేని మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో ఈ విషాదం చోటు చేసుకుంది.
తాజాగా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఈ ఘటన జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. పాఠశాలలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వలస కార్మికులను ఈ క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అయితే వీరిలో ఓ వలస కుటుంబానికి చెందిన ఆరేళ్ల బాలిక కూడా ఉంది. సోమవారం ఉదయం సదరు బాలిక నోటి నుంచి నురగలు కక్కుతుండగా.. గుర్తించిన తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కాగా బాలికను మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బెతల్‌ఘాట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. సోమవారం వేకువజామున బాలిక గాడ నిద్రలో ఉన్న సమయంలో విష సర్పం కాటేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే బాలిక శరీరంపై గాట్లను గుర్తించిన వైద్య సిబ్బంది ఆమెకు రెండు విషపు విరుగుడు ఇంజెక్షన్లు ఇచ్చారు. కానీ.. పది నిమిషాల తర్వాత చిన్నారి ప్రాణాలు విడిచింది.