టెస్ట్ క్రికెట్లో టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే తన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కానీ గత రెండేళ్లుగా వన్డే జట్టు తరుపున ఆడే అవకాశం రహానేకు రాలేదు. తన కెరీర్లో ఇప్పటివరకు మొత్తం 90 వన్డేలాడగా, రహానే(35.26) బ్యాటింగ్ సగటుతో 2962 పరుగులు సాధించాడు.
2018లో దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్ తర్వాత తిరిగి వన్డే జట్టులో ఆడలేదు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో రహానే స్పందిస్తు.. తాను వన్డే జట్టులో నెంబర్ 4లో కానీ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
కానీ తాను బ్యాటింగ్ చేయడానికి నెంబర్ 1లేదా నెంబర్ 4లో ఎంపిక చేసుకోమంటే.. నెంబర్ 1లోనే ఆడడానికి ఇష్టపడతానని అన్నాడు. తాను వన్డే జట్టులో తిరిగి ఆడతానని రహానే దీమా వ్యక్తం చేశాడు. వన్డే జట్టులో ఆడే అవకాశం ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరని, కానీ మానసికంగా అన్ని ఫార్మాట్లలో రాణించడానికి సిద్ధమని అజింక్యా రహానే పేర్కొన్నాడు.