పార్లమెంటులో పక్కపక్కనే మోదీ, రాహుల్.. అయినా మాటల్లేవ్…!

Rahul Gandhi Could Be A Credible Alternative To Narendra Modi

లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు కూడా వచ్చాయి. మూడు రాష్ట్రాల్లో అధికారం చేపడుతూ కాంగ్రెస్ సంతోషంగా ఉండగా.. బీజేపీ మాత్రం ఈ ఫలితాలతో షాక్ లో ఉంది. ఇదే ఉత్సాహంతో ఫైనల్స్ లో కూడా బీజేపీకి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ తారసపడ్డారు. అయితే వారిద్దరూ పక్కనే ఉన్నా ‘మాటల్లేవ్.. మాట్లాడుకోటాల్లేవ్’ అన్నట్లుగా సైలెంట్ గా ఉండడం ఇప్పుడు పలు చర్చలకు తావిస్తోంది. 2001 డిసెంబరు 13న పార్లమెంట్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఐదుగురు ముష్కరులు ఆయుధాలతో పార్లమెంట్‌ ఆవరణలోకి చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్, పార్లమెంట్‌లో పనిచేసే ముగ్గురు సిబ్బంది, ఓ కెమెరామెన్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి జరిగి నేటికి 17ఏళ్లు అయిన సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలో నివాళులర్పించారు.

rahul-gandhi-narendhra-modi

ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎల్‌కే అద్వానీ, సోనియాగాంధీ సహా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరై అమరులైన పోలీసులు, జవాన్లకు అంజలి ఘటించారు. అయితే ఈ కార్యక్రమంలో మోదీ, రాహుల్‌ గాంధీ తక్కువ దూరంలో కూర్చున్నప్పటికీ కనీసం మాట్లాడుకోలేదు. అయితే మన్మోహన్‌ సింగ్‌ను మాత్రం మోదీ పలకరించడం గమనార్హం. మరోవైపు కేంద్రమంత్రులు విజయ్‌ గోయల్‌, రామదాస్‌ అథావాలే రాహుల్‌గాంధీతో కరచాలనం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీకి హగ్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచిన రాహుల్ గాంధీ మరి ఈసారి ఎందుకు పలకరించలేదో అంటూ చర్చలు మొదలయ్యాయి.