Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ లో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి ఐదో వ్యక్తి కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించనున్నారు. 132 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ ఇక ముందు 47 ఏళ్ల రాహుల్ గాంధీ అధ్యక్షతన ముందుకు సాగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి నామినేషన్ తిరస్కరణ గడువు ముగియగా…రాహుల్ తప్ప ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధారిటీ చైర్మన్ ఎం. రామచంద్రన్ ప్రకటించారు. ఈ నెల 16న రాహుల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర సీనియర్ నేతల సమక్షంలో డిసెంబరు 16న రాహుల్ కు ధృవపత్రాన్ని అందించనున్నారు. సోనియా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ… 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటినుంచి… ఆమె రాజకీయ వ్యవహారాల్లో అంత చురుగ్గా ఉండడం లేదు. అనారోగ్యానికి తోడు… కాంగ్రెస్ పై రాహుల్ పూర్తిస్థాయిలో పట్టు సాధించడంతో ఆమె నెమ్మదినెమ్మదిగా..తన బాధ్యతలను కొడుక్కి అప్పగిస్తున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి కాంగ్రెస్ వ్యవహారాలన్నీ రాహుల్ నేతృత్వంలోనే సాగుతున్నాయి.
పరోక్షంగా ఆయనే పార్టీలో చక్రం తిప్పుతున్నారు. ప్రధాని మోడీపైనా, బీజేపీపైనా..అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో… కొంతకాలంగా రాహుల్ ను అధ్యక్షపీఠంపై కూర్చోబెట్టాలన్న డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది. నిజానికి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆయన్ను పక్కనపెట్టి ప్రియాంకాగాంధీని పార్టీలోకి తీసుకురావాలని అంతర్గతంగా సోనియాపై ఒత్తిడి పెరిగింది. కానీ ఆమె ఆ ఒత్తిడికి తలొగ్గకుండా… సమయం కోసం వేచిచూశారు. మూడేళ్లకాలంలో రాహుల్ పరిపక్వత చెందిన నేతగా ఎదిగారు. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో తన ప్రభావం చూపలేకపోయిన రాహుల్ ప్రతిపక్షస్థానంలో మాత్రం అంతా తానే అయి పార్టీని ముందుకు నడుపుతున్నారు. ఒకప్పుడు బలహీనంగా కనిపించిన రాహుల్ ఇప్పుడు ప్రధాని మోడీ తర్వాత దేశంలో అత్యంత ప్రజాకర్షణ ఉన్న నాయకుడిగా మారారు.
అందుకే రాహుల్ కు అధ్యక్ష బాద్యతలు కట్టబెట్టేందుకు ఇదే సరైన సమయమని ఆమె భావించారు. ఆమె మనోభావానికి తగ్గట్టుగా పార్టీ నేతలు కూడా రాహుల్ ను అధ్యక్షస్థానంలో చూడాలని తహతహలాడుతుండడంతో యువరాజు పట్టాభిషేకానికి మార్గం సుగమమయింది. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ అరంగేట్రం చేసిన రాహుల్ క్రమక్రమంగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. 2007లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ సారధ్య బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో ఏఐసీసీ ఉపాధ్యక్షడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ నాలుగేళ్ల తర్వాత అధ్యక్షపీఠాన్ని అధిరోహిస్తున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబంలో నాలుగో తరానికి చెందిన రాహుల్ సారధ్యంలో కాంగ్రెస్ గమనం ఇకపై ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి.