Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏదైనా ఓ దారుణ ఘటన జరిగినప్పుడు సాధారణంగా రాజకీయ నేతలు బాధితుల్ని పరామర్శిస్తారు. వారికి అనేక హామీలు ఇస్తారు. కానీ తక్షణం అమలయ్యే హామీలను నెరవేరుస్తారు తప్ప దీర్ఘకాలం కొనసాగించాల్సిన హామీల సంగతి కాలక్రమంలో మర్చిపోతారు. ఆ తర్వాత బాధితులు రాజకీయ నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ ఉంటారు. దేశంలోని అన్నిచోట్లా… అన్ని పార్టీల్లోనూ ఇదే జరుగుతుంది. ఏ పార్టీ నేతా దీనికి మినహాయింపు కాదు… కానీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. బాధిత కుటుంబసభ్యునికి అన్నిరకాలుగా అండదండగా నిలిచారు. తన లక్ష్యాలను చేరుకునేందుకు అన్నివిధాలా సాయం అందించారు. పెద్ద హోదాలో ఉన్నప్పటికీ… బాధిత కుటుంబానికి ఓ శ్రేయోభిలాషిలా వ్యవహరించారు. అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా ఒకేరకంగా ప్రవర్తించారు. విషయంలోకి వస్తే…
2012లో దేశరాజధాని ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. బాధితురాలు నిర్బయ కుటుంబానికి అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో సహాయసహకారాలు అందించింది. నిర్భయ వైద్యానికయిన ఖర్చుమొత్తం ప్రభుత్వమే భరించింది. నిర్భయ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. ఇళ్లస్థలం మంజూరుచేసింది. సాధారణంగా అయితే ప్రభుత్వ బాధ్యత ఇంతటితో పూర్తవుతుంది. కానీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ఆ కుటుంబం పట్ల మరింత బాధ్యతను భుజాన వేసుకున్నారు.
నిర్భయ సోదరుడు అమన్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అన్ని రకాలుగా ప్రోత్సాహమిచ్చారు. అక్కపై జరిగిన దారుణాన్ని, ఆమె మరణాన్ని మర్చిపోలేక అమన్ నిత్యం బాధతో కుమిలిపోయేవాడు. అప్పటికి అతని వయసు 12 ఏళ్లు. మిలటరీలో చేరాలని కలలు కన్న అమన్ అక్క మరణం తరువాత తీవ్ర షాక్ కు గురయ్యాడు. దీంతో నిర్భయ తల్లి అమన్ గురించి రాహుల్ గాంధీకి వివరించింది. అమన్ పరిస్థితి తెలుసుకున్న రాహుల్ అతనికి కౌన్సెలింగ్ ఇప్పించారు. నిరంతరం ధైర్యం చెప్పేవారు. రోజూ ఫోన్ చేసి అమన్ తో మాట్లాడేవారు. పైలట్ ట్రైనింగ్ కోర్స్ చేయాల్సిందిగా అమన్ కు సూచించిన రాహుల్ గాంధీ పదోతరగతి పూర్తికాగానే… ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరన్ అకాడమీలో సీటు ఇప్పించారు. అయితే అక్క మరణంతో డిప్రెషన్ లో ఉన్న అమన్ చదువుపై సరిగ్గా దృష్టిపెట్టలేకపోయాడు. దీంతో రాహుల్ అమన్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పేవారు. అలా తల్లిదండ్రులు, రాహుల్ గాంధీ సహకారంతో అమన్ ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ పూర్తిచేసుకున్నాడు. త్వరలోనే అమన్ విమానం నడుపబోతున్నాడు.
ఈ సందర్భంగా… నిర్బయ తల్లి రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తన కుమారుడు అమన్ రాహుల్ గాంధీ వల్లే పైలట్ అయ్యాడని ఆమె తెలిపారు. తన కుమారుడి కలను రాహుల్ నెరవేర్చారని ఆమె సంతోషం వ్యక్తంచేశారు. రాహుల్ తమకు అన్ని విధాలా సాయమందించారని, ఆయన సోదరి ప్రియాంక కూడా తరచూ తమ క్షేమసమాచారాలు తెలుసుకునేవారని నిర్భయ తల్లి చెప్పారు. రాజకీయాలంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, కుట్రలు, కుతంత్రాలు మాత్రమే అనుకుంటాం. కానీ… రాజకీయ నాయకులు మనసు పెడితే ఎలాంటి మంచి పనులు చేస్తారనేదానికి నిర్భయ కుటుంబానికి జరిగిన మేలే ఉదాహరణ.