రాహుల్ భాయ్ హగ్ కి మోడీ షాక్ !

Rahul Gandhi hugs PM Narendra Modi

అవిశ్వాస తీర్మానంపై చర్చతో హీటెక్కిన లోక్ సభలో ఒక్క సారిగా నిశబ్దం ఆవరించింది. ఆ తరువాత స్పీకర్ సహా సభ్యుల ముఖాలలలో నవ్వులు చిందాయి. ఇందుకు కారణం రాహుల్ గాంధీ తన ప్రసంగం ముగించిన అనంతరం నేరుగా ప్రధాని మోడీ స్థానం వద్దకు వెళ్లి ఆయనకు విషెస్ చెప్పారు. రాహుల్ చర్యతో మోడీ కూడా ఒక్క క్షణం అవాక్కయ్యారు. నివ్వెరపోయారు. అనంతరం తేరుకుని మంచి ప్రసంగం చేశారని భుజం తట్టి అభినందించారు. మీ దృష్టిలో నేను పప్పూనే కావచ్చు, నాపై మీకు చాలా ద్వేషం ఉంది, కానీ నాకు మీ మీద కోపం లేదు అని రాహుల్ గాంధీ అన్నారు.

అంతకముందు తన ప్రసంగంలో ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కొన్ని పారిశ్రామిక సంస్థలకు మేలు చేసేందుకే రాఫెల్ డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. రూ. 45 వేల కోట్ల మేరకు ఆ సంస్థకు కట్టబెట్టారని విమర్శించారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని అన్నారు. తన మాటలకు ప్రధాని నవ్వుతున్నారని కానీ, ఆయన మనసులో మాత్రం ఆందోళన కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే అనే విషయం స్పష్టమవుతోందని అన్నారు. తాను ప్రధానిని కాదు, దేశానికి కాపలాదారుడినని మోదీ చెప్పారని కానీ ఆయన పాలనలో దేశ ప్రజలు భయంతో బతుకుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భిన్నమైన రాజకీయవేత్తలు అని అన్నారు. ఆ ఇద్దరూ మన లాంటి వాళ్లు కాదు అని, గెలవడం ఓడిపోవడాన్ని మనం స్వాగతిస్తాం, కానీ ఆ ఇద్దరూ అధికారాన్ని కోల్పోవడాన్ని సహించరు అని రాహుల్ అన్నారు. అధికారం పోతుందన్న భయంతో.. ఇద్దరూ ఆగ్రహంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అమిత్ షా కుమారుడు జేషా పేరును రాహుల్ తెరపైకి తెచ్చారు. దీంతో, బీజేపీ నేతలు ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. ప్రధాని మోదీ మార్కెటింగ్ కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నది ఎవరని రాహుల్ ప్రశ్నించారు. బడా కంపెనీలతో మోదీ కుమ్మక్కయ్యారనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. ప్రజల బాగోగులను పట్టించుకోకుండా, పారిశ్రామికవేత్తలు మోదీ మేలు చేస్తున్నారని విమర్శించారు.