Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సోమనాథ్ ఆలయం వివాదంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. తనతో పాటు… తమ కుటుంబం మొత్తం శివభక్తులమని ఆయన చెప్పుకొచ్చారు. క్రిస్టియానిటీని నమ్మే సోనియాగాంధీ కొడుకైన రాహుల్ మత విశ్వాసాలపై కొంతకాలంగా బీజేపీ ఆరోపణలు చేస్తోంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ పలు ఆలయాలను సందర్శించడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తోన్న బీజేపీ… అసలు ఆయన హిందువే కాదని, హిందూ మతంపై ఆయనకు నమ్మకమే లేదని ప్రచారంచేస్తోంది. సోమనాథ్ ఆలయం ఘటన ఈ ప్రచారానికి ఊతం ఇచ్చింది. ఆలయం లోపలికి వెళ్తూ… రాహుల్ నాన్ హిందూ రిజిస్టర్ లో సంతకం చేయడంపై తీవ్ర దుమారం చెలరేగింది. అయితే రాహుల్ ఆ సంతకం చేయలేదని, బీజేపీ నేతలే కావాలని రాహుల్ పేరు అందులో చేర్చారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై స్పందించారు.
తన నాయనమ్మ ఇందిరాగాంధీతో పాటు తమ కుటుంబం మొత్తం శివభక్తులమని ఆయన తెలిపారు. అయితే ఇలాంటి విషయాలను తాము బయటకుచెప్పుకోమని, ఎందుకంటే అది వ్యక్తిగత అభిప్రాయమని తాము భావిస్తామని, వీటిని ఎవరూ ధృవీకరించాల్సిన అవసరం లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. దీన్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకులేదన్నారు. సోమనాథ్ ఆలయంలో అసలేం జరిగిందో కూడా వివరించారు. ముందు తాను ఆలయంలోకి వెళ్లి పర్యాటకుల పుస్తకంలో సంతకం చేశానని, ఆ తర్వాత బీజేపీ వ్యక్తులు తన పేరును రెండో పుస్తకంలో రాశారని రాహుల్ ఆరోపించారు. మొత్తానికి రాహుల్ తాతల కాలం నుంచి తాము శివభక్తులమని చెప్పడం ద్వారా తనపై హిందువు కాదని వస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టాలని భావిస్తున్నారు.